పెద్దపల్లి, (ప్రభన్యూస్): సాధారణ జీవితం గడుపుతున్న మహ్మద్ హుస్సేన్ది ముమ్మాటికి అక్రమ అరెస్టేనని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ విడుదల చేసిన లేఖలో తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది. గత రెండు నెలలుగా సికాస పునర్నిర్మాణం కొసం మందమర్రి, రామకృష్ణాపూర్ ఏరియాల్లో మావోయిస్టు భావాజాలాన్ని తీసుకెళ్తున్నారని, కరపత్రాలను పంచుతున్నారనే నెపంతో పదేళ్ల క్రితం జైలు నుంచి విడుదలై సాధారణ జీవితం గడుపుతున్న 73 ఏళ్ల వయసు కలిగిన మహ్మద్ హుస్సేన్‌ను మంచిర్యాల పోలీసులు ప్రభుత్వ ఆదేశాలతో కిడ్నాప్ చేసి ఆ తరుత అరెస్టు చూపించారని ఆరోపించింది.
ఆర్కె- 1 మైన్ రోడ్లో పారిపోతుండగా పట్టుకున్నట్లు ఒక కట్టు కథను సృష్టించి హుస్సేన్‌ను అరెస్టు చేసినట్లు తాము భావిస్తున్నట్లు తెలిపింది. 73 ఏళ్ల వృద్ధుడు పారిపోతున్నాడని చెప్పడం, జమ్మికుంటలో పదేళ్లుగా సాధారణ జీవితం గడుపుతున్న హుస్సేన్‌ను మావోయిస్టుగా చిత్రీకరించడం అబద్ధాలతో అల్లిన కట్టు కథగానే అర్ధమవుతుందని లేఖలో పేర్కొంది. అలాగే దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని, కార్పోరేట్ శక్తులతో ఒప్పందాలు చేసుకుంటున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు, కార్పోరేట్‌కు అప్పగించే కుట్ర జరుగుతుందని తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి గత జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో విదేశీ కార్పోరేట్లతో ఎన్నడూ లేని విధంగా రూ. 37,870 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాడని వివరించింది.
సింగరేణి బ్లాక్‌ల అమ్మకం కూడా ఇందులో భాగమే అని, సింగరేణి బ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమాలు చేపడుతున్నారని గుర్తు చేసింది. ఉద్యమాలను అణచి వేసేందుకు నాయకత్వం వహిస్తున్న వారిపై మావోయిస్టు ముద్ర వేసి అరెస్టులకు పూనుకుంటున్నారని ఆరోపించింది. ప్రశ్నించే వారిని ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని, నిరుద్యోగ, విద్యార్థుల అరెస్టులు ఇందుకు నిదర్శనంగా చెప్పింది. దండకారణ్యంలోనూ ఆపరేషన్ కగార్ పేరుతో మారణ హోమం సృష్టిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తున్న పిల్లల దృష్ట్యాలను దొంగచాటున చిత్రీకరించి చిన్నారులను, వారి తల్లిదండ్రులను కిడ్నా చేసి బెదిరింపులకు పాల్పడుతుందని మావోయిస్టు పార్టీ మండిపడింది.
సామ్రాజ్య వాదులకు, బడా పెట్టుబడి దారుల ప్రయోజనాలకు కొమ్ము కాస్తన్న రాష్ట్ర ప్రభుత్వం ఫాసిజాన్ని అమలు చేస్తుందని పేర్కొంది. కేంద్రంతో చేతులు కలిపి ఉద్యమకారులను, విప్లవకారులను అణిచి వేసేలా ఆపరేషన్ కగార్‌ను తీవ్రం చేసిందని లేఖలో వివరించింది. మావోయిస్టులను నిర్మూలించేందుకు అదనపు సాయుధ బలగాలు, నిధులు కావాలని, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ క్యాంపులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మంండలం కొండవాయి గ్రామంలో, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో ఏర్పాటు చేయాలని, వామపక్ష తీవ్రవాద జిల్లాలుగా గతంలో ఉండి తొలగించిన మూడు జిల్లాలను సెక్యురిటీ రిలేటెడ్ ఎక్స్‌పెండెచర్- ఎస్ఆర్ఈ స్టేటస్‌ను కొనసాగించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కోరినట్లు తెలిపింది.
దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసం పౌర సమాజంపై, ప్రజాస్వామిక హక్కులపై జరుగుతున్న పాశవిక దాడులను ప్రజా స్వామిక వాదులు, పౌర హక్కుల సంఘాలు ప్రజాహిత కోరుతున్న వారంతా అక్రమ అరెస్టులను ఖండించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని మావొయస్టు పార్టీ లేఖలో కోరింది.