బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు
ప్రసవాల సంఖ్య పెరిగేందుకు ప్రణాళికలు
పెద్దపల్లి, జూన్ 21 (ప్రభన్యూస్): ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను కలెక్టర్ కస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఆస్పత్రిలో ఉన్న జనరల్ ఓపి, దంత వైద్య విభాగం, కంటి వైద్య విభాగం, ఎముకలు, కీళ్ల నొప్పుల విభాగం, ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డ్, సైక్రియాటిక్ విభాగాలను కలెక్టర్ తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల వైద్య సేవల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి సాధారణంగా ఓపీ ఎంతమంది రోగులు వస్తున్నారు, ఎలాంటి వ్యాధులు అధికంగా నమోదవుతున్నాయనే అంశాల పై ఆరా తీశారు.
వైద్యం అందిస్తున్న రోగులకు వారి వైద్య చికిత్స కోర్స్ పూర్తయ్యే వరకు ఫాలో అప్ చేయాలని, డ్యూటీలో ఉన్న వైద్యుల వివరాలు నోటీసు బోర్డుపై పరిశీలించిన కలెక్టర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా ఆసుపత్రి సమీపంలో గల మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి ఓటి బ్లాక్, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, చిన్నపిల్లల ఓపి, ఆరోగ్య మిత్ర, మందులు ఇచ్చే గది, పోస్ట్ నెటల్ వార్డు, రిసెప్షన్‌లను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న రికార్డులను పరిశీలించిన కలెక్టర్ ప్రతి రోగి వివరాలు పకడ్బంధిగా నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
జిల్లా ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్న రోగులతో కలెక్టర్ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేసే వైద్యులకు, వైద్య సిబ్బందికి, ఇతర సిబ్బందికి బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. నెలకు ఎన్ని ప్రసవాలు అవుతున్నాయో అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య మరింత పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాలను ప్రజలకు తెలిపి మరిన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, సంబంధిత వైద్య, ఇతర అధికారులు ఉన్నారు.