Monday, November 25, 2024

సుల్తాన్ పూర్ కు జాతీయ స్థాయి అవార్డు.. స్వీక‌రించిన స‌ర్పంచ్

పెద్దపల్లి, ఏప్రిల్ 17 (ప్రభ న్యూస్) : పెద్దపల్లి జిల్లా మరో ప్రతిష్టాత్మమైన జాతీయ అవార్డును స్వీకరించింది. క్లీన్ అండ్ గ్రీన్ గ్రామ పంచాయతీ విభాగంలో ఎలిగేడు మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో అవార్డును సాధించింది. సోమవారం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామ పంచాయతీ క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలవడంతో సుల్తాన్ పూర్ సర్పంచ్ అర్షనపల్లి వెంకటేశ్వర్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, పంచాయతీ కార్యదర్శి వినోద్ కృష్ణలతో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా షీల్డ్, ప్రశంసా పత్రంతో పాటు రూ.50 లక్షల క్యాష్ అవార్డును స్వీకరించారు.

ఈ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీపకుమార్ సుల్తానియా, కమీషనర్ హన్మంత రావు, డిప్యూటీ కమీషనర్ లు, జిల్లా పంచాయతీ అధికారి వి.చంద్రమౌళి, మండల పంచాయతీ అధికారి వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి, ఈ పంచాయతీ స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ రాజయ్య, ఈపంచాయతీ ఆపరేటర్ సుంక శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement