ధర్మారం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రజలను నమ్మబలకడం ఓ బూటకమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను రూ. 50కి మరోసారి పెంచడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సిలిండర్లతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల హాజరై మాట్లాడుతూ వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు నిత్యావసర సరుకుల ధరలను రోజు రోజుకు పెంచుతూ సామాన్యుల నడ్డి విరిచేలా కేంద్రం వ్యవహరిస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో 60 ఏళ్లలో చేసిన అప్పులను బీజేపీ పాలనలో 8 ఏళ్లలో చేశారని మండిపడ్డారు. పేదల సంక్షేమం కోసం పాటు పడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న బీజేపీ ధరల పెంపుతో వారిని నట్టేలా ముంచేలా పాలన సాగిస్తుందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వంలోనూ ఇన్నిసార్లు ధరలను పెంచిన దాఖలాలు లేవని, దేశాన్ని పాలించడంలో ప్రధాని మోడీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పద్మజ, పాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకటరెడ్డి, సర్పంచ్ లు బద్ధం సుజాత, పీ.జితేందర్ రావుతోపాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీ-సీలు, తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.