రామగిరి, డిసెంబర్ 1 : స్ట్రాంగ్ రూమ్ లకు ఈవీఎం యంత్రాల తరలింపు పూర్తయిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఇవాళ రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ లలో యంత్రాల తరలింపు ప్రక్రియను రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు రాజేష్ సింగ్ రాణా, పెద్దపల్లి, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు శ్రీధర్ లతో కలిసి ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు.
ఈసందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ… మంథని అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం యంత్రాలను గురువారం రాత్రి స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచామని, పెద్దపల్లి, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం యంత్రాలను, ఇవాళ ఉదయం స్ట్రాంగ్ రూములకు తరలించి భద్రపరిచామని కలెక్టర్ తెలిపారు. ఈవీఎం యంత్రాలు స్ట్రాంగ్ రూంకు తరలింపు ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరిగిందని, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పారదర్శకంగా యంత్రాలను తరలించామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు జే.అరుణశ్రీ, సి.హెచ్.మధుమోహన్, వి.హనుమా నాయక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.