Friday, November 22, 2024

TS : పౌర హక్కులపై మోడీ సర్కార్ ముప్పేట దాడి.. చాడ

సిరిసిల్ల, ప్ర‌భ‌న్యూస్‌: దేశంలో పౌర హక్కులపై కేంద్రంలోని మోడీ సర్కార్ ముప్పేట దాడి చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్మిక భవన్ లో స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు 30 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు తన జీవితాన్ని కమ్యూనిస్టు పార్టీకి అంకితం చేశారని అన్నారు.

- Advertisement -

దోపిడి రహిత, వర్గ రహిత సమాజం కోసం తన జీవిత కాలమంతా చేసిన పోరాటాలు స్ఫూర్తి దాయకమని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని మోడీ సర్కార్ అవలంబిస్తున్న విధానాలపై మండిపడ్డారు. లౌకిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసి పౌరుహక్కులను కాలరాస్తున్న విధానాలను ఎండగట్టారు. అబద్దాలతో కాలం వెళ్ళదీస్తూ కార్పొరేట్లకు దేశవ్యాప్తంగా 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడమే కాకుండా రైతులకు మొండి చెయ్యి చూపారని అన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా ప్రజలకు అర్థం కావాలంటే మోడీ దిగిన తర్వాత స్పష్టమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భారత కమ్యూనిస్టు పార్టీ ఇండియా కూటమి తో కలిసి పనిచేస్తున్నదని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మర్రి వెంకటస్వామి, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, సిపిఐ పట్టణ కార్యదర్శి పంతం రవి, నాయకులు నల్ల చంద్రమౌళి, నాగరాజు, మంద సుదర్శన్, అజ్జ వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement