Thursday, November 21, 2024

10న మంత్రి ప్రశాంత్‌రెడ్డి రాక.. ఆర్‌ఓబీ పనులకు శంకుస్థాపన

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల చిరకాల కాంక్ష త్వరలో నెరవేరనుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కునారం రోడ్‌లో సభా స్థలి వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ దశాబ్ధాల కాలంగా పెద్దపల్లి- కునారం రహదారిలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి లేక ప్రయాణికులు నానా అవస్థలు పడేవారన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేశారన్నారు. 119.5 కోట్ల రూపాయలతో నిర్మించ తల పట్టిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులను ఈనెల 10న సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభిస్తారన్నారు. 50 ఏళ్లలో నియోజకవర్గంలో జరగని అభివృద్ధి 8 ఏళ్లలోనే చేసి చూపించామన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తోందన్నారు.

దెశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, భారత దేశమంతా తెలంగాణ పథకాలను అమలు చేసేందుకే తెరాసను భారాసగా మార్చారన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పార్లమెంట్‌ సభ్యులు బోర్లకుంట వెంకటేశ్‌ నేత, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌లతోపాటు పలువురు హాజరవుతారన్నారు. నియోజకవర్గంలోని తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఎంపీపీలు స్రవంతి శ్రీనివాస్‌, నూనేటి సంపత్‌, నాయకులు నర్సింహరెడ్డి, గజవెల్లి పురుషోత్తంతోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement