Tuesday, November 26, 2024

మానవత్వం నడిచి వచ్చింది..

ఎల్లారెడ్డిపేట: కరోనా మరణం అంటేనే గజ గజ వణుకుతూ మృతుల అంతిమ సంస్కారం అనాధల సంస్కారంలా జరిగిన తీరుతో ఆంధ్ర ప్రభ కథనానికి స్పందన వచ్చిన తీరు మనుషుల్లో మార్పును తెచ్చింది. మానవత్వం నడిచి వచ్చి విశ్రాంత ఉపాధ్యాయుడి అంతిమ సంస్కారం ముందు నిలబడింది. అనేక మంది ఆర్య వైశ్యులు, బంధు మిత్రులు.. దహన సంస్కారానికి హాజరై మానవత్వం బతికే వుందని నిరూపించారు. కరోనాతో మరణించిన బొప్పాపూర్‌కు చెందిన అల్లాడి రాజేశం అనే విశ్రాంత ఉపాధ్యాయుడి అంతిమ సంస్కారం అనాధ శవం మాదిరిగా జరుగలేదు. ఇదే గ్రామానికి చెందిన చిలివేరు రవీందర్‌, గొల్లపల్లి గ్రామానికి చెందిన కేశెట్టి కమలమ్మ, చేపూరి పోచయ్యల దహన సంస్కారంలో కానరాని కుల సంఘాల వారు కొందరు రాజేశం అంతిమ సంస్కారంలో పాల్గొనడంతో మార్పు మొదలైందా అనిపించింది. కరోనా మృతుల అంతిమ సంస్కారం గౌరవంగా జరగాలని భావించి ఆర్య వైశ్యులతో పాటు అన్ని కులాల, మతాల, బంధు మిత్రులు గ్రామంలోని స్మశాన వాటిక వద్దకు వచ్చి విశ్రాంత ఉపాధ్యాయుడి అంత్యక్రియలు దూరంగా నిలబడి తిలకించడం, ఆయన కుమారుడు కుమార్‌, భార్య, కూతుళ్లను ఓదార్చడం మార్పుకు నాంది అనే చెప్పాలి. ప్రతి కరోనా బాధితుల కుటుంబాలకు ఇలాగే ప్రజలు కదిలి వచ్చి మనో నిబ్బరాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. మానవత్వ మా నీవు ఇంకా బతికే ఉన్నావా అన్నట్లు జరిగాయి అల్లాడి రాజేశం అంత్రక్రియలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement