ధర్మారం: తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధుకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం ధర్మారం మండల కేంద్రంలో దళిత బంధు పథకంలో భాగంగా లబ్ధిదారు అపర్ణ ఏర్పాటు – చేసుకున్న సహజ శ్రీ సలక్షన్స్ షాప్‌ను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా దళిత బంధు పథకం ద్వారా రూ.10 లక్షలను అందించి స్వయం ఉపాధిలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారన్నారు.
లబ్ధిదారులు లాభదాయక యూనిట్లను ఎంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, ఇతర రాష్ట్రాల వారు సైతం దళిత బంధును తమ రాష్ట్రాలలో అమలు చేస్తామని ప్రకటించడం ఎంతో గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ప్రజలంతా ఆయనకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈకార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్, ఫాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, వైస్ ఎంపీపీ మేడవేణి తిరుపతి, మార్కెట్ కమిటీ- చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డితో పాటు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.