పెద్దపల్లి : పరిశుభ్రత పాటించడం ద్వారా పట్టణ ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు స్వచ్ఛ సర్వేక్షన్ 2022- 23లో భాగంగా పట్టణంలోని 13, 32వ వార్డుల్లో ఓపెన్ ప్లాట్లలోని ప్లాస్టిక్ కవర్లు ఏరివేత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి స్వయంగా ప్లాస్టిక్ కవర్లు ఏరివేశారు. అనంతరం మాట్లాడుతూ… పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారన్నారు.
ప్రతి వార్డులో ప్లాస్టిక్ ఏరివేయడంతోపాటు- చెత్తను కూడా తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని కోరారు. ఇంటి చుట్టు పక్కల గల మురికి కాలువలో, రోడ్లపై చెత్త వేయరాదన్నారు. పట్టణ ప్రజలెవరూ ప్లాస్టిక్ కవర్లు, చెత్తను రోడ్లపై, మురికి కాలువలో వేయొద్దన్నారు. అన్ని వార్డుల్లో యువత వారంలో ఒకరోజు కలిసికట్టుగా వార్డు శుభ్రం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు పోతని పురుషోత్తం, పాగాల సోనీ శ్రీకాంత్, నాయకులు సమ్మయ్య, మధు, మనోజ్, మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, టౌన్ ప్లానింగ్ అధికారి అభినవ్, స్వచ్ఛ సర్వేక్షన్ ఇన్‌చార్జి ఆరెపల్లి సురేందర్, సానిటరీ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్ రెడ్డి, పులిపాక రాజు, మున్సిపల్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.