దేశంలో మోడీ ఇమేజ్ తగ్గింది..
కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు
పెద్దపల్లి రూరల్, ఆంధ్ర ప్రభ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ మోసాలపై కాంగ్రెస్ ఆద్వర్యంలో పోరాడుతామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ….. 10ఏళ్ల పాలనలో దేశంలోని సామాన్య ప్రజలకు ప్రధానిగా మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ యువతను మోసం చేశారని విమర్శించారు. యువశక్తిని నిర్వీర్యం చేసిన బీజేపీకి దేశంలో ఆదరణ తగ్గిందన్నారు. రాహుల్ పోరాటం ఫలించిందన్నారు.
రాహుల్ భావి భారత ప్రధాని కావడం ఖాయమన్నారు. గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేసినట్లు, 3 రోజుల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదు కిలోలు, ఆరు కిలోల కటింగ్ ఉండేదని తమ ప్రభుత్వ హయాంలో ఒక గింజ కూడా కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు రైతుల ఖాతాల్లో 90శాతం డబ్బులు వేశామన్నారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.