Thursday, November 21, 2024

బండి, ఈటల కుట్రలతోనే లీకేజీ : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ : పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజి వెనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హస్తం ఉందని, ఈటల అనుచరుడే ప్రశ్నపత్రాన్ని లీక్ చేసాడని శాసనమండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వాన్ని పార్టీని బద్నామ్ చేయాలని, ప్రభుత్వం పై బట్ట కాల్చి మీద వెయ్యాలనే దురుద్దేశంతో లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన పేపర్ లీక్ చేసారని, ఇందుకు కారకులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేసారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక బురదజల్లే ప్రయత్నం బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిరుపేద విద్యార్థుల జీవితాలతో బీజేపీ నేతలు చెలగాటమాడుతున్నారని, పేపర్ లీక్ వ్యవహారంలో ఈటల రాజేందర్ ను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇద్దరు కలిసి చేసిన కుట్రలో భాగంగానే పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్ చేసారని అయన తీవ్రంగా ఆరోపించారు. మోడీ, అమీషా ల కనుసైగల్లోనే పనిచేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్, ఈటల రాజేందర్ కావాలనే పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

ఈటల, బండి సంజయ్ కేవలం రాజకీయ స్వలాభం కోసం పేద విద్యార్థుల జీవితాల్లో చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజస మని అయన ప్రశ్నించారు. ప్రశ్నపత్రం లీక్ చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ తో దిగిన ఫోటోను కౌశిక్ రెడ్డి విలేకరులకు అందజేశారు. మహేష్ అనే వ్యక్తి ఎవరో ఈటలకు, బండి సంజయ్ కి తెలియదా? గతంలో మహేష్ బీజేపీ పోలింగ్ బూత్ ఏజెంట్ గా పనిచేసిన వ్యక్తి కాదా? అని ఈటెల రాజేందర్ ను ప్రశ్నించారు. కమలాపూర్ మండలం దేశ్రాజు పల్లి చెందిన ఈటల అనుచరుడే మహేష్ అని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్ పీఏగా పని చేస్తున్న వ్యక్తికి పేపర్ లీక్ అయిన విషయం ఎలా తెలిసిందని, పేపర్ లీక్ వ్యవహారం వాట్సప్ చాటింగ్ లో తాను ఎలా పెట్టాడని, పేపర్ లీక్ వ్యవహారం మీకు సంబంధం లేకుంటే చాటింగ్ ఎలా చేశారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. తన స్వార్థ, కుటిల రాజకీయాల కోసం ఈటల రాజేందర్ గతంలో హుజురాబాద్ ఎన్నికల సమయంలో సెంటిమెంట్ డ్రామా ఆడారని, కేంద్రం నుండి నిధులు తేకుండా, ఎన్నికల హామీలు తుంగలో తొక్కి హుజురాబాద్ ప్రజలను మోసం చేసాడని, తాజాగా ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తూ పేద విద్యార్థుల జీవితాలతో అయన చెలగాటం ఆడుతున్నాడని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్టుగా బిజెపి నాయకులు వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో ఒక విష సంస్కృతికి తెరలేపుతున్నారని, బీజేపీ నేతలను నమ్మవద్దని హుజురాబాద్ ప్రజలను అయన కోరారు. ఎవరెన్ని ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీ వెంటనే తెలంగాణ ప్రజలు ఉంటారని, బండి సంజయ్ కి ఈటల రాజేందర్ ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ విలేకరులసమావేశంలో ఎంపీపీ ఇరుమల్ల రాణి, మున్సిపల్ చైర్మన్ జి.రాధిక, కొలిపాక శ్రీనివాస్, హుజురాబాద్ మండల, పట్టణ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement