ఎన్టీపీసీ : కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన చేస్తున్న కార్మికులపై ఎన్టీపీసీ యాజమాన్యం లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమైన చర్య అని రామగుండం ఎమ్మెల్యే కోరుకొండ చందర్ అన్నారు. ఈరోజు ఎన్టీపీసీ గేట్ ఆవరణలో శాంతి యుతంగా సమస్యల పరిష్కారం కోసం నిరసన చేస్తున్న కార్మికులపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది లాఠీఛార్జిలో గాయాలైన కార్మికులను రామగుండం ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. గత వేతన ఒప్పందంలో ఎన్టీపీసీ యాజమాన్యం అంగీకరించి పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకులపై, కార్మికులపై ఎలాంటి హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడం ఎన్టీపీసీ యాజమాన్యం మొండి వైఖరికి నిదర్శనమన్నారు. కార్మికులపై లాఠీఛార్జి చేసిన సీఐఎస్ఎఫ్ అధికారులు, యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు కార్మికుల పక్షాన పోరాడుతామని ఎమ్మెల్యే అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement