Tuesday, November 26, 2024

గుంజుకోవ‌డ‌మే బిజెపి తంత్రం – అభివృద్ధి, సంక్షేమ‌మే కెసిఆర్ మంత్రం..

సిరిసిల్ల: నిధులు అడుగుతుంటే కేంద్ర అవార్డులతోనే సరిపెడుతున్నదని మంత్రి కెటిఆర్ అన్నారు… ముస్తాబాద్ మండ‌లం మోహినికుంట‌లో నూత‌నంగా నిర్మించిన 65 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగిస్తూ, మోహినికుంట‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. మ‌రో 6,825 ఇండ్లు జిల్లాలో క‌ట్టుకోబోతున్నామ‌ని తెలిపారు. బిజెపి మాట‌ల త‌ప్ప అభివృద్ధి గురించి ప‌ట్టించుకోద‌ని ఫైర్ అయ్యారు.. తెలంగాణ‌కు రావ‌ల‌సిన నిధులు వెంట‌నే విడుద‌ల చేయాల్సిందిగా నీతి ఆయోగ్ చెప్పినా మోడీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయారు. రాష్ట్రం నుంచి ప‌న్నుల రూపంలో ల‌క్ష‌ల కోట్ల రూపాయిలు తీసుకుంటున్న కేంద్రం ఇవ్వాల‌సిన‌ వాటా విష‌యంలో మాత్రం మొండిచేయి చూపుతుంద‌ని అన్నారు.. కేవలం తీసుకోవడమే బీజేపీ ప్రభుత్వ పాలసీనా అని ప్రశ్నించారు. మాకు నిధులు ఇవ్వకున్నా పర్లేదు కానీ.. మా దగ్గరకు వచ్చి గొప్పలు చెప్పొద్దని కేటీఆర్‌ సెటైర్లు వేశారు. బీజేపీ నేతలకు మెదడు మోకాళ్లలో ఉందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాలు అభివృద్ధికి ఆమ‌డ దూరంలో ఉన్నాయ‌ని, కానీ తెలంగాణ‌లో మాత్రం అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల‌గా ముందుకెళ్తున్నాయ‌ని చెప్పారు. 75 ఏండ్ల స్వాతంత్ర్యంలో ఏ పార్టీ చేయ‌ని అభివృద్దిని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసి చూపించింద‌న్నారు. వేస‌వి కాలంలోనూ ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత‌మైన మంచినీరు ఇచ్చిన ఘ‌న‌త టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌న్నారు.ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే స్వ‌యంగా ప్ర‌క‌టించింద‌ని గుర్తు చేశారు. గ‌తంలో ఇందిర‌మ్మ ఇండ్ల కోసం కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఒక్క ఇందిర‌మ్మ ఇల్లు కోసం రూ. 75 వేలు వారు ఖ‌ర్చు చేస్తే.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మాత్రం పేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో రూ. 5 ల‌క్ష‌ల‌తో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను క‌ట్టించి ఇస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. మోహినికుంట గ్రామానికి ఉత్త‌మ పంచాయ‌తీ అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement