స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుని సంతోషంతో గడుపుతున్న సమయం. దాదాపు రాత్రి 10 గంటలు దాటి ఉంటుందేమో . కరీంనగర్ -I టౌన్ పరిధిలోని అశోక్ నగర్ లో 1 ½ సంవత్సరాల శిశువు కిడ్నాప్ అయ్యిందన్న సమాచారం కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు పలు బృందాలుగా విడిపోయి 4 గంటల్లోనే కేసును ఛేదించి శిశువును సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉంది. టెక్నాలజీ సహాయంతో ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నారు పోలీసులు.
కాగా, ఈ కేసులో కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ లో ప్రైవేటు డ్రైవరుగా పనిచేస్తున్న శనిగరపు సంతోష్, అతని దోస్తు కొలమద్ది రాములు కలిసి చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కరీంనగర్, అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ కుత్బోద్దీన్ మాంసం వ్యాపారం చేస్తున్నాడు. అతనికి ఒకటిన్నర సంవత్సరాల పాప ఇంటి ముందు రోడ్డుపై ఆడుకుంటుండగా నిందితులు కిడ్నాప్ చేశారు.