డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి మూడు రోజులు క్లీనింగ్ పనులు
తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి మంజుల
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు ఝలక్ ఇస్తూ పెద్దపల్లి న్యాయమూర్తి మంజుల తీర్పునిచ్చారు. మంగళవారం వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ 13మందిని పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి మంజుల 13 మందికి 14,500 రూపాయల జరిమానా విధించారు.
అయితే అత్యధికంగా మద్యం సేవించి వాహనం నడిపిన సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన మామిడి రమేష్, పెద్దపల్లికి చెందిన పంకజ్ కు 500రూపాయల జరిమానాతో పాటు సామాజిక సేవలో భాగంగా మూడు రోజుల పాటు జిల్లా కోర్టుతో పాటు పెద్దపల్లి క్లీనింగ్ పనులు నిర్వహించాలని తీర్పునిచ్చారు.
బుధ, గురు, శుక్రవారాల్లో ఇద్దరినీ క్లీనింగ్ పనుల్లో ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. న్యాయమూర్తి తీర్పు మేరకు రమేష్, పంకజ్ లచే మూడు రోజులు క్లీనింగ్ పనులు చేయిస్తామని పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ అనిల్ కుమార్ తెలియజేశారు.