స్వాతంత్ర్య పోరాటం చేసి అమరులైన వీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో మంగళవారం షహీద్ అష్పాకుల్లా ఖాన్ వెల్ఫేర్ సొసైటీ ఆద్వర్యంలో అష్పాకుల్లా ఖాన్, పండిట్ రాంప్రసాద బిస్మిల్ వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… దేశానికి వచ్చిన స్వాతంత్ర్యం ద్వారా ఆనందంగా జీవిస్తున్నామంటే దానికి సమరయోధులు చేసిన పోరాట ఫలితమేనన్నారు. అలాంటి స్వాతంత్ర్య సమరయోదులను మనమంతా గుర్తుకు చేసుకొని స్మరించుకోవడం ఎంతో అవసరమన్నారు. వారి ఆశయాలను, పోరాట విలువలను భావితరానికి చాటి చెప్పాలి… వారి స్పూర్తితో యువత ముందుకు సాగాలన్నారు. షహీద్ అష్పాకుల్లా ఖాన్, పండిట్ రాంప్రసాద బిస్మిల్ కూడా స్వతంత్రోధ్యమంలో ఆంగ్లేయుల చేత ఉరి తీయబడి అమరత్వం పొందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో షహీద్ అష్పాకుల్లా ఖాన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.