Saturday, November 23, 2024

పేద‌లు గుడిసెలు వేసుకోవడం నేరమా? : సీఎం కేసీఆర్‌కు బినొయ్ విశ్వం లేఖ

ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడం నేరమా? ఈ కారణంగానే పేద ప్రజలను దారుణంగా కొడతారా? అని ప్రశ్నిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు సిపిఐ పార్లమెంటరీ నాయకుడు, జాతీయ కార్యదర్శి బినొయ్ విశ్వం లేఖ రాశారు. హనుమకొండ సమీపంలోని గుండ్ల సింగారం వద్ద ఇటీవల పేద ప్రజలపై జరిగిన దాడి నేపథ్యంలో నేను మీకు ఈ లేఖ రాస్తున్నాన‌న్నారు. రియల్టర్లకు సంబంధించిన గూండాలు విరుచుకుపడడంతో కనీసం 40 మందికి గాయాలయ్యాయి. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకోవడమే వారు చేసిన నేరమా? నిజానికి వారు ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి, రియల్టర్ల నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నార‌న్నారు. ల్యాండ్ మాఫియా ముందు పోలీస్ అధికారులు మౌన ప్రేక్షకుల్లా వ్యవహరించారన్న సమాచారం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింద‌న్నారు. ల్యాండ్ మాఫియాను, రియల్టర్ గూండాలను అడ్డుకోవాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా, పేద ప్రజలపై జులుం ప్రదర్శించడం అన్యాయం అన్నారు. చట్ట విరుద్ధమని సిపిఐ పార్లమెంటరీ నాయకుడు, జాతీయ కార్యదర్శి బినొయ్ విశ్వం అన్నారు. గుండ్ల సింగారం గ్రామంలో పోలీసులు వ్యహరించిన తీరు వారికి ల్యాండ్ మాఫియాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నద‌న్నారు. ఇలాంటి అవాంఛనీయ పరిణామాలు మీ ప్రభుత్వ గౌరవాన్ని తగ్గిస్తాయని ఆయన అన్నారు. గుండ్ల సింగారం వద్ద పేదలపై పోలీసులు జరిపిన దమనకాండపై విచారణకు ఆదేశించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాన‌న్నారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ హామీని నిలబెట్టుకోవాలి, ఇళ్లుగానీ, ఇంటి స్థలాలు గానీ లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సత్వరమే చర్యలు
చేపట్టాలని ఆయన కోరారు. ఇలాంటి వారికి ప్రభుత్వ భూములను పంచాలి. ఈ దిశగా చర్యలు చేపడతారని, మీ నుంచి సత్వరమే సమాధానం వస్తుందని ఆశిస్తు న్నాను’ అని విశ్వం తన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement