- పెద్దపల్లి డీసీపీ అఖిల్ మహాజన్
పెద్దపల్లి : ద్విచక్ర వాహనాలు దొంగలించడంతోపాటు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను పెద్దపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఇన్‌చార్జి డిసిపి అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు- చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లికి చెందిన నేదునూరి శ్రావణ్ అనే యువకుడు చెడు వ్యసనాలకు అలవాటుడి దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నాడన్నారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడి కేసుల పాలు కావడంతో జైలుకు వెళ్లి వచ్చినా ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. రాత్రివేళలో ఒంటరిగా తిరుగుతూ ఇంటి ముందు పార్కు చేసిన బైక్‌లను దొంగతనం చేసి, వాటిపైనే ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో నుంచి గొలుసులను స్నాచింగ్ చేస్తుంటాడన్నారు. దొంగిలించిన సొత్తును అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డాడన్నారు. ఈ క్రమంలో మంగళవారం పెద్దపల్లి పట్టణంలో ఎస్‌ఐ రాజేశ్ సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుడి వద్ద నుంచి 58 గ్రాముల బంగారం, 6 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో శ్రావణ్‌పై కరీంనగర్ వన్‌టౌన్ పరిధిలో 12, టౌటౌన్ పరిధిలో 6, త్రీటౌన్ పరిధిలో 1, రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 1, సుల్తానాబాద్ పరిధిలో 2, మంచిర్యాల పరిధిలో 3, పద్దపల్లిలో 3 చొప్పున 18 కేసులు నమోదైనట్లు వివరించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐ రాజేశ్, సిబ్బందిని డీసీపీ అభినందించి నగదు రివార్డులు అందించారు. ఈసమావేశంలో పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్‌ఐ లు రాజేశ్, మౌనికతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.