భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని కరింనగర్ పోలీస్ పరెడ్ మైదానంలో రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు . ఈ సందర్బంగా మాట్లాడుతూ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
రైతు దేశానికే వెన్నముక, ప్రజల ఆకలి తీర్చే అన్నదాత రైతు అన్నారు రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. రైతును రాజును చేయాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి రైతు బంధు, రైతు భీమా పథకాలను ప్రవేశపెట్టారు. రైతు బంధు పథకం ద్వారా 2022 వానాకాలానికి ఇంతవరకు 1,81,725 మంది రైతులకు 177 కోట్ల 67 లక్షల రూపాయలను వారి ఖాతాలలో జమ చేశాం అన్నారు.
రైతు కుటుంబాలకు ధీమా
రైతుభీమా పథకం. జిల్లాలో ఇంతవరకు 456 మంది రైతులు మరణించగా, 401 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 20 కోట్ల 05 లక్షల రూపాయలను ఈ పథకం క్రింద మరణించిన రైతుల నామిని ఖాతాలలో జమచేశామన్నారు.
రైతులు పండించిన వరి దాన్యాన్ని కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నాం అన్నారు. 2021- 22 యాసంగి సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు 337
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. రైతుల నుండి ఇంతవరకు 3 లక్షల 27 వేల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని కొనుగోలు చేశాం. ఇట్టి దాన్యాన్ని జిల్లాలోని 178 మిల్లులకు పంపించడం జరిగింది. ఈ వానాకాలం సీజన్ లో 2 కోట్ల 60 లక్షల రూపాయల సబ్సిడితో 6,297 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందించాం. అలాగే వానాకాలం సీజన్ లో 73,682 టన్నుల వివిధ రకాల ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాం. జిల్లాలో ప్రతి వినియోగదారునికి కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ ను అందిస్తున్నాం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినను దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు, దళితజాతి సాధికారికత అనేది కలగానే మిగిలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ముఖ్య మంత్రి కేసిఆర్ దళితుల అభివృద్ధి, సంక్షేమం కోరకు అనేక చర్యలు చేపట్టారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల స్పూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముఖ్య మంత్రి కే.సి.ఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి స్వయం ఉపాధి కోసం 10 లక్షల రూపాయల ఉచిత ఆర్థిక సహాయం అందించడం దళిత బంధు పథకం లక్ష్యం. దేశంలో ఇంత పెద్ద నగదు మొత్తాన్ని దళిత కుటుంబాలకు ఏ పథకం ద్వారా ఎన్నడూ అందించలేదు. ఇంతటి భారీ ఆర్థిక సహాయాన్ని దళిత కుటుంబాలకు నేరుగా అందిస్తున్న అతి పెద్ద నగదు బదిలీ పథకంగా దళిత బంధు పథకం చరిత్రకెక్కింది అన్నారు.
చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. నేత కార్మికులకు అవసరమైన నూలు, రసాయనాల కొనుగోలుపై 40 శాతం రాయితీ అందిస్తున్నాం. రైతు భీమా పథకం మాదిరిగానే నేతన్న భీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏదేని కారణాల చేత నేత కార్మికులు చనిపోతే వారి నామినీకి 5 లక్షల రూపాయాలు వారి ఖాతాలో జమచేయడం జరుగుతుంది. అన్ని మరమగ్గాలను 50 శాతం సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేస్తున్నాం. జిల్లాలోని 19 ప్రాధమిక చేనేత సహకార సంఘాలకు 3 కోట్ల 47 లక్షల క్యాష్ క్రెడిట్ ఋణాలు మంజూరు చేశాం.
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుంది. చేపల పెంపకానికి అవసరమయ్యే మొత్తం పెట్టుబడిని ప్రభుత్వమే భరించి లాభాలను మాత్రం మత్స్యకారులకు అందించే కార్యక్రమాలు అమలుచేస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 11 వేల 173 టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యం కాగా ఇంతవరకు 6,037 టన్నుల చేపలు ఉత్పత్తి కాబడినవి అన్నారు. అలాగే 466 టన్నుల రొయ్యల ఉత్పత్తి లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 255 టన్నులు రొయ్యలు ఉత్పత్తి కాబడినవి. మత్స్యకారులకు ప్రమాద భీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల వారసులకు 5 లక్షలు, పాక్షికంగా అంగవైకల్యం పొందిన వారికి 1లక్ష రూపాయల చొప్పున చెల్లిస్తున్నాం. గొర్రెల పెంపకంలో అపార అనుభవం ఉన్న గొల్ల కుర్మలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు “గొర్రెల యూనిట్ల పంపిణీ” కార్యక్రమం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం క్రింద గత రెండు విడతలో భాగంగా 13,439 మంది లబ్ధిదారులను గుర్తించి ఇంతవరకు 3,586 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీచేశాం.
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశయ సాధనలో భాగంగా కరీంనగర్ జిల్లాకు 150 కోట్లతో మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. ఈ మెడికల్ కాలేజీలో 100 మెడికల్ సీట్లతో తరగతులు నిర్వహించేలా జిల్లా జనరల్ హస్పిటల్ ను
బోధన ఆసుపత్రిగా ఆప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జి.ఓ జారిచేసింది. కరీంనగర్ జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసి పరిపాలన అనుమతులు జి.ఓ. ను రాష్ట్ర ముఖ్య మంత్రి కేసిఆర్ గారు స్వయంగా అందించినందుకు గాను జిల్లా ప్రజల తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.