Tuesday, November 26, 2024

TS | హామీలు అమలు చేయకుంటే వదిలి పెట్టం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

పెద్దపల్లి రూరల్, (ప్రభ న్యూస్) : తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను హోల్ సేల్ గా మోసం చేయడమే పాలనలో మార్పా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అద్యక్షుడు కోరుకంటి చందర్ అధ్యక్షతన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేపట్టిన 36 గంటల రైతు నిరసన దీక్ష ముగింపు సమావేశంలో ఆదివారం నిరంజన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో రైతులను గోసపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని విమర్శించారు. 110 రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యవసాయ ముఖ చిత్రం మారిందన్నారు. ఎన్నికల ముందు రూ. 7500 కోట్లు రైతు బంధు నిధులు ఇవ్వకుండా అడ్డుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు బంధు నిధులు దారి మళ్లించి కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని మండిపడ్డారు. కేసిఆర్ పాలనలో రూ. 72,815 కోట్లు రైతు బంధు ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు 1.31 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉండగా కేసిఆర్ పాలనలో 2.38 కోట్ల ఎకరాలు సాగు విస్తీర్ణం పెంచామన్నారు.

2014 కు ముందు 68లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 3కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సామర్థ్యం పెంచామన్నారు. తమ హయాంలోని పథకాలను అమలు చేయకుండా అటకెక్కించారని విమర్శించారు. రూ 15 వేలు రైతు బంధు, రూ 2 లక్షలు రుణమాఫీ, తులం బంగారం, మహిళకు నెలకు రూ 2500, కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్ అమలు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్ర ఖజానాను మంత్రులు బిల్లుల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పెద్ద కుట్రకు పాల్పడిందని ఆగ్రహించారు.

కాళేశ్వరం శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన అధ్భుత కట్టడం బరాజ్ కం ప్రాజెక్ట్ అని అన్నారు. బరాజ్ లలో నీరు నిల్వ సామర్థ్యం తక్కువని సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కాళేశ్వరం నీటి నిల్వ సామర్థ్యం ఉందన్నారు. 2పిల్లర్లు పగుళ్లు బారితే కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందని దుయ్యబట్టారు. 80వేల కోట్ల రూపాయలతో కాళేశ్వరం నిర్మిస్తే, రూ లక్ష కోట్లు అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. బీఆర్ఎస్ కు పుట్టిన బిడ్డలను కాంగ్రెస్, బీజేపీ ముద్దాడుతూ వారి అభ్యర్థులుగా బరిలో నిలుపుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ పాదం మోపిన రాష్ట్రాల్లో శని దాపురించినట్లేనని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. ఎండుతున్న పంటలను కాపాడేందుకు ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందించాలని, ఎండిన పంటలకు ఎకరాకు రూ 25 వేల చొప్పున పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మోసాలను బారాసా శ్రేణులు గ్రామాల్లో ఎండగట్టాలని పిలిపించారు. పెద్దపల్లి ఎంపీ గా బారాసా అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని కోరారు. ఒక ఎంపీ గెలిస్తే 7 గురు ఎమ్మెల్యేలు ఒడినట్లేనని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement