Friday, November 22, 2024

Peddapalli: పనిచేయని దద్దమ్మలు ఓట్ల కోసం వస్తారు.. నిలదీయండి… ఎమ్మెల్యే దాసరి

అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి చేయని దద్దమ్మలు ఓట్ల కోసం వచ్చినప్పుడు నిలదీయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో గడపగడపకు ప్రచారం నిర్వహించి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు గ్రామంలో జరిగిన అభివృద్ధిని తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ… గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరుపేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు, బతుకమ్మ చీరల పంపిణీ లాంటి ఒక్క కార్యక్రమమైన ఏదైనా రాష్ట్రంలో ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజు 200 రూపాయల పింఛన్ ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేలకు పెంచారన్నారు. దివ్యాంగుల పెన్షన్ 4వేలకు పెంచామని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా వెయ్యికి మించి పింఛన్ ఇవ్వడం లేదని, అధికారం కోసం దొంగ హామీలు ఇస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీలు 60 గ్యారంటీలు అని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గత రెండు పర్యాయాలు ఆదరించిన విధంగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మద్దతు ఇవ్వాలని కోరారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఎంపీపీ రమాదేవి రాంగోపాల్ రెడ్డి, మండలాధ్యక్షుడు కంది చొక్కారెడ్డి, వైస్ ఎంపీపీ రమేష్, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు తమ్మడవేణి మల్లేశం, కరాటే లక్ష్మణ్, తొగరు శ్రీనివాస్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు నర్సింగ్ యాదవ్ లతో పాటు భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement