Sunday, November 24, 2024

బంగారు తెలంగాణలో పూరి గుడిసెలా.. కేసీఆర్ ను ప్రశ్నించిన భట్టి

ధర్మారం, ఏప్రిల్‌ 18 (ప్రభన్యూస్‌): బంగారు తెలంగాణలో పూరి గుడిసెలా అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మంగళవారం హాథ్‌ సే హాథ్‌ జోడో కార్యక్రమంలో భాగంగా ఆయన చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని దొంగతుర్తి మీదుగా సాగింది. ఈసందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ… సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్‌ పేదల గోసను పట్టించుకోవడం లేదని, ఆయన ధ్యాసంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెప్పు కోసమేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. దళిత రిజర్వు అయిన ధర్మపురి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్ పేదల సంక్షేమం కోసం పాటుపడకుండా సీఎం కేసీఆర్‌ మెప్పు కోసమే పని చేస్తున్నారన్నారు. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి కూడా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల చట్టాన్ని అమలు చేసేందుకు చొరవ తీసుకోకపోవడం బాధాకరమన్నారు. రోడ్డు పక్కన చెర్ల జ్యోతితో పాటు ఐదు కుటుంబాలు పదేళ్లుగా చిన్నపాటి గుడిసెలలో ఉంటూ డబుల్‌ బెడ్‌రూం ఇప్పించాలని మంత్రికి మొరపెట్టుకున్నా ఇప్పించిన పాపాన పోలేదన్నారు. బంగారు తెలంగాణలో ఇలా పూరి గుడిసెలు ఎక్కడివని ఎద్దేవా చేశారు. నాలుగు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్‌ కుటుంబమే బంగారమైందన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఒక్క కుటుంబమే బాగు పడిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరలు అదుపులో ఉండి ఏ ఒక్క సామాన్య, మధ్య తరగతి కుటుంబం ఇబ్బందులు పడలేదన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నాయకులు తమ స్వార్థం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం ద్వారా లక్ష 25 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఒక గుంటకి కూడా సాగునీటిని అందివ్వలేదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా మాత్రమే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కాళేశ్వరం నుండి ఎల్లంపల్లికి 136 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారని, అదే గోదావరి వరద ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 1400 టీఎంసీల నీటిని కిందకు వదిలారని, కాళేశ్వరంతో ఫలితం శూన్యమన్నారు. అలాగే సింగరేణి ద్వారా లక్షా 25వేల ఉద్యోగాలు వస్తే.. వాటిని కుదించి 46వేలకు తగ్గించి, కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఒకే దఫాలో, 500 రూపాయలకే సిలిండర్‌, ప్రభుత్వ మిగులు భూములు సాగు చేస్తున్న పేదలకు పట్టాల పంపిణీ, ఇంటి స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇంటి స్థలం లేని వారికి కూడా ఇంటి స్థలం కూడా సమకూర్చుతామన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, అన్ని కాంగ్రెస్‌ పార్టీ హాయంలో చేసిన పనులేనన్నారు. శాసనమండలి సభ్యుడు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఎనిమిది సార్లు శాసనసభలకు ఎన్నికైన అనుభవం ఉన్న నాయకుడని కొనియాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ పార్టీలా మారిందని, 4 కోట్ల మంది ప్రజలను మోసగించి తెలంగాణలో నలుగురు కుటుంబ సభ్యులు మాత్రమే ఉద్యోగాలు పొందారని విమర్శించారు. ఈ యాత్రలో ఎమ్మెల్సీ టి. జీవన్‌ రెడ్డి, జగిత్యాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు మద్దెల రవీందర్‌, గజ్జల స్వావిు, బొల్లి స్వామి, బ్లాక్‌ 2 అధ్యక్షుడు కోమటిరెడ్డి రవీందర్‌ రెడ్డి, పత్తిపాక ఎంపీటీ-సీ బద్దం అజయ్‌పాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement