Friday, November 22, 2024

కరీంనగర్ లో భారీ ‘తిరంగా’ ర్యాలీ..

కరీంనగర్ : తపాల శాఖ కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. పోస్టల్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలను చేతబూని భారత్ మాతాకీ జై, హర్ ఘర్ తిరంగా అంటూ నినాదాలు చేశారు. కరీంనగర్ హెడ్ పోస్టాఫీసు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ కలెక్టర్ బంగ్లా, ఆర్టీసీ బస్టాండ్, వన్ టౌన్ పోలీసు స్టేషన్, వెంకటేశ్వర దేవాలయం, కూరగాయల మార్కెట్, టవర్ సర్కిల్ మీదుగా తిరిగి పోస్టాఫీసుకు చేరింది. ఈ సందర్బంగా కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వై.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత తపాల శాఖ హర్ ఘర్ తిరంగా పేరిట జాతీయ జెండాలను ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో అమ్మాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించామని చెప్పారు. కరీంనగర్ డివిజన్ పరిధిలో 20వేల జెండాలను అమ్మాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు 10 వేలకుపైగా జాతీయ జెండాలు విక్రయించినట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే డిమాండ్ ను బట్టి జాతీయ జెండాలను తెప్పిస్తామని అన్నారు. ప్రతి పోస్టాఫీసులో జాతీయ జెండాలు అమ్ముతారని, సెలవు రోజులలో కూడా విక్రయాలు ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఎఎస్పీ సునీల్, ఐపీఓలు శ్రీనాథ్ రెడ్డి, రాజు, పోస్టు మాస్టర్ ఫజల్ రహమాన్ తో పాటు భారీగా పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement