ఓవైపు కుండపోత.. మరోవైపు హోరు గాలి.. ఇంకోవైపు రాజీవ్ రహదారి నుంచి పొంగి పొర్లుతున్న వరద నీరు.. వాటిని తొలగించి దారి ఇస్తేనే గమ్యానికి చేరే ప్రయాణికులు.. ఇలాంటి సమయంలో రక్షక భటులం మేమున్నామంటూ రోడ్డుపైకి వచ్చారు.. పాదరక్షలు ఉన్నా వేసుకోలేని పరిస్థితి.. ఇలాంటి సమయంలో రహదారి పైకి వచ్చి దారిని క్లియర్ చేసి వాహనాలను పంపించి ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుస్తున్నారు పెద్దపల్లి పోలీసులు.. విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్లు రోడ్డుపైనే ఉండి ప్రయాణికుల సేవలో పరితపిస్తూ అందరికి చేత ప్రశంసలందుకుంటున్నారు.. అసలే రాజీవ్ రహదారి.. వేలాది వాహనాలు వస్తూ పోతుంటాయి.. అత్యవసర సేవలకు సంబంధించిన సరుకులు, మందులు, అత్యవసర చికిత్స కోసం వ్యాధి గ్రస్తులను తీసుకెళ్లే ఆంబులెన్స్‌లు.. ఇలా ఎన్నో వాహనాలు ఈ రహదారిపై నుంచే వెళ్తుంటాయి. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రాజీవ్ రహదారిపై గత ఏడు రోజులుగా భారీ వర్షాల వల్ల పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి వద్ద వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. ఓవైపు రహదారి మొత్తం నీటితో మునిగిపోగా, మరోవైపు నుంచి వాహనాలను మళ్లించి రెండు వైపులా వాహనాలను సురక్షితంగా వరద నీటిలో చిక్కుకోకుండా పంపించే పనిలో 24 గంటలపాటు పోలీసులు శ్రమిస్తున్నారు.
రాత్రింబవళ్లు కుండపోత వర్షంలో వరద నీటిలో విధులు నిర్వర్తిస్తూ ప్రయాణికులు క్షేమంగా వెళ్లేలా దగ్గరుండి సేవలందిస్తున్నారు. భారీ వర్షానికి తడిసి ముద్దయి జ్వరాల బారిన పడినా ప్రజలు ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు విధుల్లో నిమగ్నమయ్యారు. రంగంపల్లితోపాటు గర్రెపల్లి, దుబ్బపల్లి వద్ద సబ్ డివిజన్ పోలీసులు పహారా కాస్తున్నారు. వరద అధికంగా ఉన్న సమయంలో భారీ వాహనాలను మాత్రమే అనుమతిస్తూ కొద్దిగా తగ్గముఖం పడితే ఇతర వాహనాలకు సైతం ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో సీఐలు ప్రదీప్‌కుమార్, అనిల్‌కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు రాజేశ్, ఉపేందర్, మహేందర్, వెంకటకృష్ణ, శ్రీనివాస్,మౌనిక,శివాని, సహదేవ్‌సింగ్, రవీందర్ తొపాటు సివిల్, డిస్ట్రిక్ట్ గార్డ్ పోలీసులు 24 గంటలపాటు శ్రమిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి ఎలాంటి హానీ జరగకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై ప్రయాణికులతోపాటు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారీ వర్షంలో విధులు నిర్వర్తించిన పోలీసులను రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి, డీసీపీ అఖిల్ మహజన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిలు అభినందించారు.