Saturday, November 23, 2024

హ‌నుమ‌త్ నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగుతున్న కొండ‌గ‌ట్టు అంజ‌న్న ఆల‌యం…

కవిత నేతృత్వంలో అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణం
42 రోజులుగా.. నిరంతరాయంగా కార్యక్రమాలు
దక్షిణ భారతదేశంలో తొలి రామకోటి స్థూపం నిర్మాణానికి సన్నాహాలు

కొండగట్టు అంజన్న క్షేత్రం హనుమత్‌ నామస్మరణతో మార్మోగుతోంది. ఇప్పటికే మండలం పూర్తిచేసుకున్న అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణం.. రెండు మండలాల కాలంపాటు నిరంతరాయంగా సాగనుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్‌కి అంటూ నినదించి దేశంలోనే అత్యంత మహిమ గల కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్దికి దీక్ష బూనారు. మంగళవారం హనుమాన్‌ చిన్న జయంతి నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంజన్న ఆశీస్సులతో ప్రతీ ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. భక్తుల హనుమత్‌ స్మరణతో కొండగట్టు అంజన్న క్షేత్రం ప్రతిరోజూ మార్మోగుతున్నది. వేలాది మంది భక్తుల సమక్షంలో 42రోజుల క్రితం అఖండ హనుమాన్‌ ఛాలీసా పారాయణానికి అంకురార్పణ జరగ్గా, నాటినుంచి నేటివరకు నిరంతరాయంగా కొనసాగుతున్నది. కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో జూన 4 వరకు రెండు మండలాల కాలం పాటు పారాయణం జరగనుండగా, సోమవారంతో మండల కాలం 41 రోజులు పూర్తి చేసుకొంది. మంగళవారం రెండోమండలానికి సంబంధించిన పారాయణం జరుగుతోంది.
కవిత సంకల్పం
కాశీ సందర్శన అనంతరం వేదపండితుల సూచనమేరకు కవిత.. ఆఖండ హనుమాన్‌ చాలీసా పారాయణ కార్యక్రమం ప్రారంభించారు. ఆలయ అర్చకులు, దాతలు, ప్రజా ప్రతినిధులతో అంజన్న సేవా సమితిని ఏర్పాటు చేశారు. మార్చి 9న ఎమ్మెల్సీ కవిత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి రూ.90 లక్షలతో చేపట్టనున్న రామకోటి స్థూపం నిర్మాణానికి భూమి పూజ చేశారు. మార్చి 17న ఐదుకోట్ల రామపత్రులను కొండగట్టు ఆలయానికి తీసుకురావడంతో పాటూ అఖండ హనుమాన్‌ ఛాలీసా పారాయణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల మధ్యలో ఒక గంటపాటు, కొండపై ఉండే భక్తులు, అర్చకులు కలిసి 11సార్లు అఖండ హనుమాన్‌ ఛాలీసా పారాయణం చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న హనుమాన్‌ ఆలయాల్లో సైతం గంటపాటు భక్తులు ఛాలీసా పారాయణం చేయాలని అంజన్న సేవా సమితి పిలుపునిచ్చింది.
తొలి రామకోటి స్థూపం
దక్షిణ భారతదేశంలోనే తొలి రామకోటి స్థూపాన్ని ప్రతిష్ఠిం చాలని కొండగట్టు అంజన్న సేవా సమితి సంకల్పించింది. కొండపైన రూ.90 లక్షలతో అత్యద్భుతంగా 23 అడుగుల ఎత్తుతో స్థూపాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఐదు కోట్ల రామ నామ లిఖితాలు ఉండగా వాటన్నింటినీ మార్చి 17న ఎమ్మెల్సీ కవిత కొండగట్టుపైకి శోభాయాత్రగా తీసుకువచ్చి స్వామివారి సన్నిధిలో ఉంచి అర్చన చేసిన తర్వాత పారాయణ వేదికపై భద్రపరిచారు. హనుమాన్‌ పెద్ద జయంతి పర్వదినం రోజున మొత్తం 11 రామకోటి లిఖిత ప్రతులతో రామకోటి స్థూపాన్ని ప్రతిష్ఠించేందుకు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement