Sunday, September 8, 2024

KNR: అంగన్వాడీల సేవలను గుర్తించని ప్రభుత్వం.. రేపు కేటీఆర్ కార్యాలయం ముట్టడి

సిరిసిల్ల, సెప్టెంబర్ 22 (ప్రభన్యూస్) : ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నిరంతరం సేవలందిస్తున్నప్పటికీ వారి సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని, వీరి డిమాండ్లు పరిష్కరించకపోవడం శోచనీయమని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా రెండు రోజులు రిలే నిరాహార దీక్షల కార్యక్రమం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ… 12 రోజులుగా సమ్మె చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. గ్రామ గ్రామాన ఓటర్ల జాబితాతో పాటు ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి అంగన్వాడీ ఉద్యోగులు సర్వే చేసి ప్రభుత్వ పథకాలు విజయవంతం కావడానికి దోహద పడుతున్నారన్నారు.

అయినప్పటికీ సమ్మె పరిష్కరించడంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తున్నదన్నారు. సామాన్యులు చనిపోతే వారికి ఇన్సూరెన్స్ లు ఉన్నాయని, కానీ అంగన్వాడీ ఉద్యోగులు విధుల్లో చనిపోతే ఎలాంటి బీమా సౌకర్యం లేదన్నారు. ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి, స్థానిక శాసనసభ్యుల నుండి ఎలాంటి స్పందన రావడంలేదని, దీనికి నిరసనగా రేపు మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. తాము రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, సమాన పనికి సమాన వేతనం మొదలైన సాధారణ కోరికలు కోరుతున్నామన్నారు. వీటిని పరిష్కరించని పక్షంలో సమ్మె మరింత ఉదృతం చేస్తామని కడారి రాములు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు కల్లూరు చందన, ప్రధాన కార్యదర్శి ఎదురుగట్ల మమత, జిల్లా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, జిల్లా అధ్యక్షుడు అజ్జె వేణు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ట్రెజరీ కొండి కొప్పుల పద్మ, ఉపాధ్యక్షురాలు ఓరగంటి శ్యామల, పద్మ, చొప్పరి అంజలి, వాణి, మంగ, రమా, ఉమా, సునీత, జ్యోతి, లక్ష్మి, ఆయేషా, సుజాత, వజ్ర, వీణు బాయి, సైదా షఫీ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement