పెద్దపల్లి, (ప్రభన్యూస్): సీఎం సహాయనిధి ద్వారా రాష్ట్రంలోని పేదలకు ఎంతో మేలు జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 125 మందికి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 40లక్షల 79వేల 800ల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే దాసరి జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న పేదలకు ఆపద సమయంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక భరోసా ఇస్తున్నారన్నారు. నిరంతరం పేదల సంక్షేమం కోసమే తెరాస ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అనారోగ్యం పాలైన వారు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారు, ఇతర కారణాలతో చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని వారు సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్‌తోపాటు నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, భారాస ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.