Sunday, November 3, 2024

TS: ఫేక్ అటెండెన్స్‌తో ఫండ్స్ కొట్టేశారు.. కేంద్ర ప‌థ‌కం ప‌క్కాదారి..

పీఎంకేకే పథకంలో అవకతవకలు
నకిలీ వేలి ముద్రల ద్వారా అక్రమాలు
ప్రైవేటు సంస్థకు చెందిన నలుగురు అరెస్టు
ప్రధాన సూత్రధారుల అరెస్టుకు రంగం సిద్ధం
వివరాలు వెల్లడించిన రామగుండం సీపీ శ్రీనివాస్‌

ఆంధ్ర‌ప్ర‌భ‌, గోదావరిఖని: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన‌ ప్రధాన మంత్రి కౌశల్ కేంద్ర (పీఎంకేకే) పథకంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని రామ‌గుండం సీపీ శ్రీ‌నివాస్ అన్నారు. దీనికి సంబంధించి నకిలీ వేలిముద్రల ద్వారా అవకతవకలకు పాల్పడిన అల్టిమేట్‌ ఎనర్జీ రీసోర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వాహకులను అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు. సోమవారం కమిషనరేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌కు చెందిన మల్లికార్జున్‌, నర్సంపేటకు చెందిన సలీం జాఫర్‌, వెంకటేశ్‌, మంచిర్యాలకు చెందిన దేవేందర్ క‌లిసి నకిలీ వేలిముద్రల ద్వారా అక్రమాలకు పాల్పడడంతో అరెస్టు చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పీఎంకేకే పథకం ద్వారా దేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపారు.

ఈ స్కీమ్‌ను అల్టిమేట్‌ ఎనర్జీ రీసోర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ భోపాల్‌ కేంద్రంగా నిర్వ‌హిస్తోంద‌ని, దేశంలోని నిరుద్యోగ యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పెంచేలా దీనికి బాధ్యతలు అప్పగించారన్నారు. సంస్థకు సంబంధించి తెలంగాణలో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేయగా, భోపాల్‌లో హెడ్‌ ఆఫీసర్‌ ఆర్గనైజర్‌గా సాహిల్‌ వలీ, హైదరాబాద్‌లోని మధురానగర్‌ కార్యాలయ ఆఫీస్‌ ఇన్‌చార్జిగా ఆవునూరి శ్రీనివాస్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మంచిర్యాల, హుజుర్‌నగర్‌, జనగామలో స్కిల్‌ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. మంచిర్యాలలో నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు చెందిన మల్లికార్జున్‌ పని చేస్తుండగా, 2020 నుంచి ఏడాదికి 320 మందికి ప్రతి సెంటర్‌లో నిరుద్యోగ‌ యువతకు శిక్షణ ఇస్తున్నారన్నారు.

- Advertisement -

అటెండెన్స్ ఆధారంగా..

యువతకు కోర్సులలో ట్రైనింగ్‌ కల్పించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక్కొక యువకునికి రూ.13వేల చొప్పున నిధులు మంజూరు చేయగా, ఈ ఏడాది నుండి 720 మందికి పెంచి, ఒక్కో యువకునికి ట్రైనింగ్ కోసం 3వేల రూపాయల చొప్పున కేటాయించిందన్నారు. కోర్సులకు హాజరయ్యే అభ్యర్థుల అటెండెన్స్‌ ఆధారంగా మాత్రమే నిధులు కేటాయిస్తార‌ని, మంచిర్యాల సెంటర్‌లో ఈ ఏడాది 300అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ఇందులో రోజు సగటున 50మంది యువకులే హాజరవుతుండడంతో సంస్థకు హాజరు శాతం ప్రకారం తక్కువ నిధులు వ‌స్తున్నాయ‌ని, దీంతో సంస్థకు రాబడి తక్కువ కావడంతో హెడ్‌ ఆఫీస్‌ నిర్వాహకుడు సాహిల్‌ వలి, హైదరాబాద్‌ ఆఫీస్‌ ఇంచార్జ్‌ ఆవునురి శ్రీనివాస్‌ ఆదేశాలతో మంచిర్యాల సెంటర్‌ ఇంచార్జ్‌ మల్లికార్జున్‌ తనకు పరిచయస్థుడైనా నర్సంపేటకు చెందిన విజయ్‌ అనే వ్యక్తి సూచనలతో నర్సంపేటకు చెందిన సలీం జాఫర్‌, వెంకటేశ్వర్లు సహాయంతో 250 మంది అభ్యర్థుల నకిలీ వేలి ముద్రలను తయారు చేసి గైర్హాజరైన అభ్యర్థుల అటెండెన్స్‌ను ఫేక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ ద్వారా బయోమెట్రిక్‌ మిషన్‌లో నమోదు చేస్తున్నారు.

రంగంలోకి టాస్క్‌ఫోర్స్‌..

ఎవ‌రూ రాకున్నా అభ్యర్థులంతా హాజరైనట్లు రిపోర్ట్స్‌ ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి నిధులను కాజేస్తున్నారన్నారు. ఈ స్కామ్‌ గురించి సమాచారం రావడంతో టాస్క్‌ ఫోర్స్‌ వారిని రంగంలోకి దింపి మంచిర్యాలలో నిర్వ‌హిస్తున్న‌ సెంటర్‌లో ఆఫీస్‌ ఇంచార్జ్‌ గా వున్న దేవేందర్‌ ను విచారించడంతో స్కామ్‌ వెలుగులోకి వచ్చిందన్నారు. డీసీపీని విచారణకు ఆదేశించడంతో మంచిర్యాల పోలీస్‌లు దేవేందర్‌ను పట్టు-కొని ఆఫీస్‌లో వున్న ఫేక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌, ఆఫీస్‌ రికార్డ్స్‌ ను జప్తు చేసి కేసు నమోదు చేశామన్నారు. విచారణ చేపట్టిన మంచిర్యాల పోలీస్‌లు హైదరాబాద్‌కు చెందిన మల్లికార్జున్‌ ను, నర్సంపేటకు చెందిన సలీం జాఫర్‌ను, వెంకటేష్‌ ను అదుపులోకి తీసుకొని వారివద్దనుండి ఫేక్‌ ఫింగర్‌ ప్రింట్‌ తయారు చేయుటకు ఉపయోగించే సామాగ్రి ని రికవరీ చేశారన్నారు.స్కామ్‌లో ప్రధాన సూత్రదారులైన భోపాల్‌కు చెందిన సాహిల్‌, హైదరాబాద్‌ కు చెందిన అవునూరి శ్రీనివాస్‌లను అరెస్ట్‌ చేయాల్సి ఉందని సీపీ స్పష్టం చెశారు. ఈ సమావేశంలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement