కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమరంపేటలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటిబాట పట్టారు. స్కూల్ చుట్టు వరదనీరు చేరుకోవడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు వర్షంలో తడుస్తూ నీటి ప్రవహాన్ని దాటుకుంటూ ఇంటిబాట పట్టారు. భారీ వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో మండలంలోని సోమరం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామానికి అనుకొని ఉన్నటువంటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది.
దీంతో ప్రమాదక స్థాయిలో ప్రవహిస్తున్న వాగు కల్వర్టుపై నుండి భారీగా ప్రవాహం కొనసాగుతుంది. ఈ గ్రామానికి చుట్టూ వాగులే ఉండడంతో గ్రామానికి రాకపోకలు తెగిపోయాయి. ఎగువన ఉన్నటువంటి గొలుసు కట్టు చెరువులు నిండి మత్తడి పడడంతో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో గ్రామస్తులు భయం భయంగా కాలం గడుపుతున్నారు.
రహదారుల పై రాజపోకలు బంద్ :
పెద్దపల్లి జిల్లా జూలపల్లిలోని ప్రధాన రహదారి బ్రిడ్జిపై నుండి ఉధృతంగా ప్రమాద స్థాయిలో హుస్సేన్ మియా వాగు ప్రవహిస్తుండటంతో ఈ రహదారిపై రాకపోకలు నిలిచిపొయాయి. వేములవాడలో కురుస్తున్న భారీ వర్షానికి రోడ్డు తెగిపోవడంతో వేములవాడ జగిత్యాల రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో జగిత్యాల- పెద్దపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.