Saturday, November 23, 2024

మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి : మంత్రి గంగుల కమలాకర్

తెలంగాణ ఆవిర్బావానికి ముందు రాష్ట్రంలో వర్షాలు పడితే గాని చెరువులు నిండని పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం మండుటెండలో సైతం చెరువులు మత్తడులు దూక‌డంతో మత్స్య కారులకు న్యాయం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం ఎల్ఎండీ జలాశయంలోని గంగమ్మ దేవాలయం వద్ద మత్స్య శాఖా ఆధ్వర్యంలో 100 శాతం ఉచితంగా 3 లక్షల రొయ్య పిల్లలను నగర మేయర్, జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి విడుదల చేశారు. అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావం తరువాత జలాలను ఒడిసిపట్టి నిలువచేసుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసుకోవడం జరిగి నీలి విప్లవాన్ని సాదించడం జరిగిందని అన్నారు. దీని ద్వారా మండుటెండల్లో సైతం చెరువులు మత్తడులు దూకుతున్నాయని అన్నారు. ప్రతి సంవత్సరం 30 లక్షల చేప పిల్లలను విడుదల చేస్తూ ప్రత్యక్షంగా 1500, పరోక్షంగా 900 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు చూపించడం జరుగుతుందని పేర్కోన్నారు. రాష్ట్ర సంపద పెరగాలి, మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశ్యంతో జిల్లాలోని 897 చెరువులలో సుమారుగా 2.29 కోట్ల చేప పిల్లలను ప్రతి ఒక్క చేప పిల్లలకు 1.63 పైసల చొప్పున దాదాపు 162.37 లక్షలు ఖర్చుచేసి చెరువులలో విడుదల చేయడం జరిగిందని తెలిపారు. 2019 సంవత్సరం నుండి ఎల్ఎండిలో 77 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరిగిందని 19 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అన్నారు. భూమిని నీళ్లను నమ్ముకున్న వారికి అండగా నిలబడి భరోసా కల్పిస్తున్నారన్నారు. చేపపిల్లలు పంపిణిలో మత్స్యకారులకు ఎటువంటి ఖర్చులేకుండా రవాణ చార్జీలు, చేప పిల్లల ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తూ పూర్తిగా ఉచితంగా చేప పిల్లలను పంపిణి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కాలేశ్వరం జలాలతో చెరువులన్ని నిండుకుండలా మారాయని, అద్భుత మత్స్య సంపద పెరిగిందన్నారు. దీంతో దిగుమతి చేసే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, నగర మేయర్ వై.సునీల్ రావు,జిల్లా మత్స్యశాఖ అధికారి దేవేందర్, సిబ్బంది, మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement