Friday, November 22, 2024

TS : ఫైటర్ కు… చీటర్స్ మధ్య పోటీ… కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

కరీంనగర్, ప్ర‌భ‌న్యూస్ః రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానానికి ఫైటర్ కు చీటర్స్ కు మధ్య పోటీ జరగనుందని బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌లో వాకర్స్‌ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. యువతతో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడి మద్దతు ఇవ్వాలని కోరారు.

- Advertisement -

అనంతరం మాట్లాడుతూ గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య జరుగుతున్న పోటీ అని ఎటువైపు ఉంటారో ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. ఎన్నికలొచ్చినప్పుడు చుట్టపు చూపుగా వచ్చిపోయే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల కోసం నిత్యం పోరాడే గళానికి మధ్య జరుగుతున్న పోటీలో ఎటువైపు ఉంటారో ఆలోచించుకోవాలన్నారు. బీజేపీని పాకిస్తాన్ టీంగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించడంపైనా తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఎన్నికల్లో ఓడపోతామనే భయంతోనే ముస్లిం ఓట్లను కొల్లగొట్టేందుకు తమది ముస్లింల పార్టీ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావే చెబుతున్నారంటే ఎవరిది పాకిస్తాన్ జట్టో ప్రజలకు అర్ధమైందన్నారు. బీజేపీ భారతీయ ఆత్మ అని, హిందుత్వ సిద్దాంతాలను పుణికిపుచ్చుకున్న పార్టీ అని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 2వ విడత పోలింగ్ ముగిశాయని బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తున్నట్లు పోలింగ్ సరళి అర్ధమైతుందన్నారు.

బీజేపీ సొంతంగా 370, ఎన్డీఏ కూటమితో కలిసి 400కుపైగా స్థానాలతో మళ్లీ మోదీ హ్యాట్రిక్ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.తనకు ఓటేసి గెలిపిస్తే దాదాపు రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చానని, స్వయంగా ప్రధాని చేతుల మీదుగా జాతీయ రహదారుల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టి అనేక అభివ్రుద్ది పనులు చేపట్టానన్నారు. గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా మోదీ సహకారంతో వేల కోట్లను కరీంనగర్ అభివృద్ధికి కేటాయించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటమి ఖాయమైందని అందుకే ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు ఒక్కటై నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. మోదీపట్ల అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తుండటాన్ని కరీంనగర్ సమాజం గుర్తించాలని కోరుతున్నానని వారిద్దరూ ఎన్నడూ ప్రజలను పట్టించుకోలేదన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రతో 1600 కి.మీలపైగా పాదయాత్ర చేసి ప్రభుత్వ మెడలు వంచానని కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు వందల కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నానన్నారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే దేశంలో ఐపీఎల్ నడుస్తోందని ఎన్డీఏ టీంకు మోదీ కెప్టెన్ అని మరి కాంగ్రెస్ కూటమికి కెప్టెన్ ఎవరో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడం లేదని ఇగ కేసీఆర్ ను ఎవరూ దేఖే పరిస్థితి కూడా లేదన్నారు. కేసీఆర్ వల్ల నిరుద్యోగులు, రైతులు, ఆర్టీసీ కార్మికులుసహా అన్ని వర్గాల ప్రజలు అల్లాడితే ఎందుకు పట్టించుకోలేదన్నారు. మే 13న జరిగే పోలింగ్ లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి పార్లమెంటుకు పంపాలని అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement