కరీంనగర్ / హైదరాబాద్ – కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కన్నుమూశారు. నేటి తెల్లవారుఝామున 4 గంటలకు గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం హుజూరాబాద్ మండలం జూపాక. సాయిరెడ్డి గతంలో ఉమ్మడి కరీంనగర్ జడ్పీ చైర్మన్గా కూడా పనిచేశారు. 1983, 1989లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
సాయిరెడ్డి మృతి పట్ల మంత్రి ఈటల దిగ్భ్రాంతి
రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి మృతి తీరని లోటని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లా సమితి చైర్మన్ గా పనిచేసి రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, హుజురాబాద్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసన సభ లో అడుగుపెట్టి తనదైన శైలితో ప్రజలకు చేరువయ్యారని కొనియాడారు. రాజకీయాల్లో హుందాతనంతో వ్యవహరించిన సాయిరెడ్డి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో సాయిరెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. సాయిరెడ్డి మృతిపట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సాయిరెడ్డి మృతి తో నేడు నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.