Tuesday, July 2, 2024

TS: మాదకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత… సిద్దిపేట సీపీ అనురాధ

సిద్దిపేట – మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పోలీస్ కమిషనర్ బి.అనురాధ పిలుపునిచ్చారు. బుధవారం మారకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులు, కార్యాలయ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఉపన్యాసం, పెయింటింగ్, గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్, సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కళాశాల, పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడుమార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని, మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, నరాలు, గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో యువతీ యువకులు మంచి అలవాట్లతో తల్లిదండ్రులు, గురువులు చెప్పిన మాటలు విని చదువుతూ ముందుకు వెళితే చక్కని భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. మాద‌కద్రవ్యాల విషయంలో ఎంత పెద్ద వారు ఉన్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మాద‌క ద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని, డ్రగ్ రహిత తెలంగాణ సమాజం కోసం అందరూ కృషి చేయాలని సూచించారు.

జూన్ 26న మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత/విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీల్లో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు పట్టణాలు, మండలాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ…
తాము మారకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని, వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి, తనతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియపరుస్తానని, డ్రగ్- రహిత సమాజం లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినౌతానని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. పోలీస్ కళాబృందం, తెలంగాణ సాంస్కృతిక సారధి బృందం డ్రగ్స్ గురించి దాని వినియోగం వల్ల జరిగే నష్టాల గురించి పాటల ద్వారా, విద్యార్థినీ విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎస్.మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ మధు, ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస్ మూర్తి, డీడబ్ల్యుఓ శారద, ఇన్స్పెక్టర్లు లక్ష్మీబాబు, విద్యాసాగర్, ఉపేందర్, రామకృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ గురుస్వామి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణి కుమార్, రాజేష్, పూర్ణ చందర్, ప్రసాద్, కమిషనర్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ, ప్రవేట్ కళాశాలల, స్కూళ్ల యాజమాన్యం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement