Friday, November 22, 2024

KNR: కూలీ వేషం కట్టి.. పేకాటరాయుళ్ల భరతం పట్టిన పోలీసులు

ముస్తాబాద్, ఆంధ్రప్రభ : నిత్యం ఖాకీ యూనిఫామ్ వేసుకొనే పోలీసులు పేకాటరాయుళ్ల భరతం పట్టేందుకు కూలీ వేషం కట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేకాట ఆడుతున్న వారిని పట్టుకోవాలని పోలీసులు రైతు కూలీల వేషం కట్టి పేకాట ఆడుతున్న స్థలానికి చేరుకొని పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులకు ముస్తాబాద్ మండలంలోని బందనకల్ గ్రామ శివారు ప్రాంతంలో పంటపొలాల మధ్య పేకాటాడుతున్నారనే పక్కా సమాచారం అందింది. అయితే, పోలీస్ జీప్ రాగానే పరుగులు తీస్తున్నారనే విషయాన్ని గమనించి పోలీసులు కూలీలుగా మారి పేకాట స్థావరం వద్దకు చేరుకున్నారు. వ్యవసాయ కూలీలుగా భావించి పేకాట రాయుళ్ళు దర్జాగా పేకాట ఆడుతున్నారు.

- Advertisement -

పొలం పనులకు కూలీలు వస్తున్నారనుకొని వారి దగ్గరకు వెళ్లే వరకు కూడా పేకాట ఆడుతున్నారు. పోలీసులు వారిని చుట్టుముట్టే వరకు వారికి అర్థం కాలేదు. చివరకు డ్రెస్ చూసి పేకాట రాయుళ్లు హడలెత్తిపోయారు. పోలీసులు పేకాట ఆడుతున్న ఏడుగురుని అరెస్ట్ చేసి వారి దగ్గరి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిపై కేసు నమోదు చేశారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement