Friday, November 22, 2024

యాదవుల ఆర్థికాభివృద్ధి కోసమే గొర్రెల పంపిణీ… ఎమ్మెల్యే దాసరి

కాల్వ శ్రీరాంపూర్‌, జులై 11 (ప్రభన్యూస్‌): యాదవుల ఆర్థిక అభివృద్ధి కోసమే గొర్రెల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మల్యాల గ్రామంలో యాదవలకు రెండవ విడతలో మంజూరైన గొర్రెల యూనిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ… జిల్లాలో 10వేల యూనిట్లు ఉండగా, పెద్దపల్లి నియోజకవర్గానికి 6,600 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. కాల్వ శ్రీరాంపూర్‌ మండలంలో మొదటి విడతలో 840 మందికి పదికోట్ల 50 లక్షలు, రెండవ విడతలో 840 మంది గొర్రెల కాపరులకు రూ 14 కోట్ల 70 లక్షల మంజూరైన యూనిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు కేసీఆర్‌ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. దళిత బంధు, రైతు బీమా, రైతు బంధు, సాగునీరు, ఉచిత కరెంటు, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, ఆరోగ్య లక్ష్మి, గృహలక్ష్మితో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి ప్రతి ఇంటికి లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మళ్లీ గొప్పగా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు.

ఎన్నికల సమయంలో కొంతమంది గ్రామాల్లో తిరుగుతూ తప్పుడు ప్రచారం చేస్తూ దుర్మార్గమైన ఆలోచనతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గ్రామంలో కమ్యూనిటి హాల్‌ భవనం మంజూరు చేయాలని యాదవ కులస్తులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌, జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, జిల్లా పశు వైద్యాధికారి రవీందర్‌, మండల పశు వైద్యాధికారి సురేష్‌, విండో చైర్మన్‌ చదువు రామచంద్రారెడ్డి, సర్పంచ్‌ లంక రాజేశ్వరి సదయ్య, ఎంపీటీసీ గడ్డం రామచంద్రం, గొర్రెల పెంపకం దారుల గ్రామశాఖ అధ్యక్షుడు మూడెత్తుల రాజయ్యలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement