పెద్దపల్లి రూరల్ : 8 ఏళ్ల తెరాస పాలనలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛతతోనే రోగాలు దూరమవుతాయని తెలిపారు. పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రతను పాటించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా గ్రామ స్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు పారిశుధ్య నిర్వహణ కోసం చెత్త సేకరణకు ట్రాక్టర్లను అందించినట్లు వివరించారు.
తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేసి పంచాయతీ సిబ్బందికి సేకరణకు వచ్చినపుడు అందించాలని, ఆ దిశగా ప్రజలను సమాయత్తం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారు రామ్మూర్తి, ఎంపీడీఓ రాజు, పెద్దపల్లి సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నర్సింహరెడ్డి, మండల కో- ఆప్షన్ హబీబ్ ఉర్ రెహమాన్, మండల వ్యవసాయ అధికారి అలివేణి, ఏపీఓ రమేశ్‌బాబు, ఎంపీడీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రమణ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.