ప్రమాణాలు పాటించలేదంటూ ఫిర్యాదు
కోర్టు తీర్పుపై స్పందించిన అధికారులు
సిరిసిల్ల, సెప్టెంబర్ 5 (ప్రభ న్యూస్) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సాక్షాత్తు మున్సిపల్ వైస్ చైర్మన్ దుకాణ సముదాయ నిర్మాణంలో ప్రమాణాలు పాటించకపోవడంపై ఆగ్రహిస్తూ పలువురు కోర్టు మెట్లు ఎక్కారు. విచారణ జరిపిన అనంతరం న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్ అధికారులు కదిలారు. సదరు వ్యాపార సముదాయానికి సంబంధించిన షెట్టర్లను గురువారం తొలగించారు. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాల్ జిల్లా కేంద్రంలో వ్యాపార సముదాయాన్ని నిర్మించాడు.
ఈ విషయంలో ప్రమాణాలు పాటించడం లేదంటూ కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో కదిలిన మున్సిపల్ అధికారులు గురువారం షెట్టర్లు తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. నిబంధన పాటించని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు. సాక్షాత్తు మున్సిపల్ వైస్ చైర్మన్ సముదాయం పైన మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో షెట్టర్లు తొలగించిన విషయం చర్చనీయాంశంగా మారింది.