పెద్దపల్లి : జిల్లాలో ఉన్న విత్తన, ఎరువుల, క్రిమీ సంహారక డీలర్లు రైతులకు నాణ్యమైన సలహాలందించి వారి వృద్ధి కోసం తమవంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి డీఏఈఎస్ఐ కోర్సును లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. డీఏఈఎస్ఐ కోర్సులో కనీసం 10 ప్రామాణిక పరీక్షలకు హాజరైన ప్రాక్టీస్ చేసే ఇన్పుట్ డీలర్లందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలోని 341 మంది డీలర్లలో 170 మంది డిప్లొమా కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ప్రస్తుత సంవత్సరం 80 మంది డీలర్లను ఎంపిక చేసి 48 వారాలపాటు ప్రత్యేక శిక్షణ అందిస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులను పారా ఎక్స్టెన్షన్ నిపుణులుగా మార్చడం ద్వారా క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను పరిష్కరించడమే కార్యక్రమ ఉద్దేశ్యమన్నారు. 2022-23 సంవత్సరానికి జిల్లాలో 80 మంది ఇన్పుట్ డీలర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో ఏటీ-ఎంఏ, పెద్దపల్లి, కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి ఖిల్లా నోడల్ అధికారులుగా ఉంటారన్నారు.
డీఏఈఎస్ఐ ప్రోగ్రామ్‌ను నిర్వహించే శిక్షణా సంస్థలు కో- ఆర్డినేటింగ్గా వ్యవహరించే ప్రతి బ్యాచ్‌కు ఒకరు చొప్పున మొత్తం ఇద్దరు ఫెసిలిటేటర్లను నియమించిందని తెలిపారు. ప్రతివారం మార్కెట్ సెలవు రోజు తరగతులు నిర్వహిస్తామని, 40 వారాలపాటు తరగతులు, 8 వారాలు క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందన్నారు. డిప్లొమా కోర్సు డీలర్ల కోసం ప్రత్యేక ఆలోచనతో రూపొందించడం జరిగిందని, క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సలహాలు అందించేలా డీలర్ పరిజ్ఞానం పెంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. డీలర్లు అనుభవంతోపాటు శాస్త్రీయ కారణాలతో రైతులకు వివరంగా మంచి సలహాలు చెప్పగలిగితే ఉత్తమమైన ఫలితాలు వస్తాయని, రైతులకు మెరుగైన సేవ చేసినట్లవుతుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ, ఆత్మ ప్రాజెక్ట్ అధికారి ఆదిరెడ్డి, ఫెసిలిటేటర్లు రామచంద్రారెడ్డి, కొమురయ్య, కెవికె ప్రధాన శాస్త్రవేత్త శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్ కెవికె శాస్త్రవేత్త, ఎరువుల, క్రిమి సంహారక డీలర్లు పాల్గొన్నారు.