సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాజీవ్ రహదారిపై 37 కెమెరాలు, పట్టణంలో 55 కెమెరాలు ఏర్పాటు చేశారని, రాజీవ్ రహదారిపై తొమ్మిది ప్రాంతాల్లో డివైడర్ కటింగ్ ల వద్ద హైమాస్ లైట్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డివైడర్ కటింగ్ ల వద్ద హై మాస్ లైట్లు ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
ప్రతి సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, నీరచేదనలో సిసి కెమెరాల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. సిసి కెమెరాలు నేర పరిశోధనలో ఉపయోగపడతాయని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరుగుతుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. వ్యాపార వాణిజ్య రంగాల వారు స్వచ్ఛంద సేవా సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం ముందుకు రావాలన్నారు. పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలో పెద్ద మొత్తంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రూపేష్, ఏసీపి సారంగపాణి, సిఐ లు ఇంద్రసేనారెడ్డి, అనిల్, ఎస్ఐ ఉపేందర్ లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.