చిగురుమామిడి: ఎండిన పంటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని లంబాడిపల్లి గ్రామంలో ఎండి పోయిన వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సందవేని బాలయ్య వరి చేను ఎండి పోవడంతో చాడకు తన బాధలు చెప్పుకున్నారు. తన 3.5 ఎకరాలు వరి పూర్తిగా ఎండిపోయిందని, ట్రాక్టర్ ట్యాంకర్‌తో పొలాన్ని పారించుకున్న లాభం లేకుండా పోయిందన్నారు. అలాగే సంపత్ అనే రైతు కూడా 3 ఎకరాలు వేసి నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చాడ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి వరి పంటలు వేసుకుంటే నీరు లేక లేదా పంటకు ఎర్రబొమ్మిది రోగం వచ్చి తీవ్రంగా నష్టపోయారన్నారు. శ్రీరామ్ సాగర్ వరద కాలువ పూర్తి చేయకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణమన్నారు. గత 23 ఏళ్లుగా సీపీఐ వరద కాలువ కోసం పోరాటాలు నిర్వహిస్తున్న గతంలో, నేటి పాలకులకు కనువిప్పు కలగక పోవడం సిగ్గు చేటన్నారు. తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తో గౌరవెళ్లి, గండిపెల్లి ప్రాజెక్టు లకు శంకుస్థాపన చేపించానని అప్పుడు పూర్తి చేయకుండా నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపాదికన కోట్లాడి సాధించున్న తెలంగాణలో కూడా పంటలకు నీళ్లు అందించక పోవడం దారుణమన్నారు. హుస్నాబాద్‌లో కుర్చీ వేసుకొని గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని మాట చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయని, ఆ ప్రాజెక్టులు పూర్తి చేసివుంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు పక్షపాతి అని గొప్పలు చెప్పుకోవడం కాదు రైతు నష్టాల్లో కూరుకుపోతే ఆదుకోవాలనే సోయి ప్రభుత్వాలకు ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ తక్షణమే ఒక అధికారుల బృందాన్ని ఏర్పాటు- చేయాలని, ఎకరాకు రూ. 50వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి, సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందే స్వామి, మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు అందే చిన్న స్వామి, తేరాల సత్యనారాయణ, బూడిద సదాశివ, సింగిల్ విండో డైరెక్టర్స్ చాడ శ్రీధర్ రెడ్డి, ముద్రకోల రాజయ్య, రైతు సంఘం మండల కన్వీనర్ కాంతాల శ్రీనివాస్ రెడ్డి, అనుమండ్ల మల్లారెడ్డి, కయ్యం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement