Tuesday, November 26, 2024

KNR: కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించాలి… కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

రామగిరి, డిసెంబర్ 2 (ప్ర‌భ న్యూస్): అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధంగా సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత కౌంటింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ కౌంటింగ్ పరిశీలకులు రామగుండం రాజేష్ సింగ్ రానా, మంథని సి.పి.పటేల్, పెద్దపల్లి సీ.ఎన్ శ్రీధర లతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ… డిసెంబర్ 3న ఉదయం 8 గంటలకు జేఎన్టీయు కళాశాల బ్లాక్ 2 నందు జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభ మవుతుందని, ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాల్లో 14 కౌంటింగ్ టేబుల్, ఒక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ,మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 రిజర్వ్ బృందాలు, 3 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బృందాలు అందుబాటులో ఉంటాయన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ సమయంలో ఫారం 13ఏ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ నిబంధనల ప్రకారం చివరి రౌండ్ లెక్కింపు ప్రారంభానికి ముందు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.

స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ కు ముందస్తుగా కంట్రోల్ యూనిట్ లను హమాలీలు తీసుకుని వస్తారని, ప్రతి 2 టేబుళ్ళకు ఒక హమాలీ ఉంటారని, వారికి డ్రెస్ కోడ్ ఉంటుందని, ప్రతి టేబుల్ వద్ద వారికి కేటాయించిన కంట్రోల్ యూనిట్లు మాత్రమే చెక్ చేసి కౌంటింగ్ చేయాలన్నారు. కంట్రోల్ యూనిట్ లెక్కింపు ప్రారంభానికి ముందు కంట్రోల్ యూనిట్ లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం 17సి నందు నమోదైన ఓట్లు సరిచూసుకోవాలని, తేడా వస్తే వెంటనే సదరు కంట్రోల్ యూనిట్ ను రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కంట్రోల్ యూనిట్ లో క్లాక్ ఎర్రర్ వస్తే కొత్త బ్యాటరీ వేసి ఆన్ చేయాలని, అప్పటికి క్లాక్ ఎర్రర్ వస్తే రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని, కంట్రోల్ యూనిట్ లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా.. వెంటనే రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించాలన్నారు. కంట్రోల్ యూనిట్ లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం 17సి నందు నమోదైన ఓట్లు ట్యాలీ చేసుకోని రిజల్ట్ బటన్ ప్రెస్ చేయాలని, కౌంటింగ్ ఏజెంట్లకు ఫలితాలు చూపించి వాటిని నిర్దేశించిన నమూనాలో నమోదు చేయాలని, 14 టేబుల్ వద్ద కౌంటింగ్ పూర్తయిన తర్వాత, ఆ రౌండ్ వివరాలు రిటర్నింగ్ అధికారి వెల్లడించిన తర్వాత మాత్రమే తదుపరి రౌండ్ కౌంటింగ్ ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు. కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీ ప్యాట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, వీవీ ప్యాట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిబంధనల ప్రకారం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కౌంటింగ్ నిర్వహించే సమయంలో అధికారులు, సిబ్బంది నిబంధనలను గుర్తించుకోవాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని, కౌంటింగ్ హాల్లో అధికారులు, సిబ్బంది మౌనంగా ఉండాలని, ప్రశాంతంగా వ్యవహరించాలని, ఎటువంటి సందర్భం ఎదురైనప్పటికీ ప్రశాంతంగా లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నమోదయ్యేలా చూసుకోవాలని, గందరగోళానికి గురి కావద్దన్నారు.

వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు అప్రమత్తంగా చేయాలని, అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆ స్లిప్పులను బ్లాక్ కవర్ లలో భద్రపర్చి సీల్ చేయాలని, ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేయాలని కలెక్టర్ సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరికి సెల్ ఫోన్ అనుమతి లేదని, కౌంటింగ్ కేంద్రం వద్ద అవసరమైన తనిఖీ నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ పరిశీలకులు రాజేష్ సింగ్ రానా మాట్లాడుతూ… కౌంటింగ్ సమయంలో కంట్రోల్ యూనిట్ లో ఎటువంటి ఎర్రర్ వచ్చిన వెంటనే అధికారి దృష్టికి తీసుకుని రావాలన్నారు. కౌంటింగ్ కేంద్రానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకుని రావాలని, కౌంటింగ్ కేంద్రం లోపల ఎవరికి సెల్ ఫోన్ అనుమతి లేదని, కౌంటింగ్ ఏజెంట్లతో ఎటువంటి సంభాషణలు పెట్టుకోవద్దని, ప్రశాంతంగా వ్యవహరించాలని ఎట్టి పరిస్థితుల్లో ఆగ్రహానికి గురి కావద్దన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం రిటర్నింగ్ అధికారి జే.అరుణశ్రీ, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్యామ్ ప్రసాద్ లాల్, పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి సి.హెచ్. మధుమోహన్, మంథని రిటర్నింగ్ అధికారి హనుమా నాయక్, మంథని ఆర్డీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ అధికారి తూము రవీందర్, కౌంటింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement