పెద్దపల్లి (ఆంధ్రప్రభ) అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఓదెల జడ్పిటిసి గంట రాములు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బారాస పొలిటి బ్యూరో సభ్యులు కేశవరావు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావులు కండువా కప్పి గంట రాములను పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి విజయం ఖాయం అయిపోయిందన్నారు. నియోజకవర్గంలో ఓటమి తెలవని నాయకుడు, మంచి ప్రజాబలం ఉన్న గంట రాములు పార్టీలోకి రావడం శుభ పరిణామం అన్నారు. మనోహర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, ప్రజలందరూ ఆయన వైపే ఉన్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు కాదు కదా 60 గ్యారంటీలు ఇచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సంక్షేమ పథకాల అమలుతోపాటు అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు నెలకు 3,000 అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛన్ 6000కు, రైతుబంధును 16 వేల రూపాయలకు, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు.
తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించడంతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్ సింగ్ సీనియర్ నాయకులు సి సత్యనారాయణ రెడ్డి, రమణ రెడ్డి తోపాటు బారాస ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.