ఎల్లారెడ్డిపేట: కరోనా పాజిటివ్ వచ్చిన బొప్పాపూర్ గ్రామానికి చెందిన బంగారు నగల వ్యాపారి వంగల శ్రీనివాస్ హోమ్ క్వారెంటెన్ పూర్తి కాకుండానే గొల్ల పల్లి శివారులో నిర్వహిస్తున్న జాగృతి గోల్డ్ వర్క్స్ దుకాణాన్ని తెరచి వ్యాపారం సాగిస్తున్నారని స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మండల వైద్యాధికారి మానస, ఆరోగ్య కార్యకర్త కమల, ఆశా కార్యకర్తలు సుజాత, దేవేంద్రలు దుకాణం వద్దకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 11 రోజుల క్రితం శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని, అతడిని 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. వైద్యుల ఆదేశాలు బేఖాతర్ చేసిన శ్రీనివాస్ 3 రోజుల నుండి హోంక్వారంటైన్‌లో ఉండకుండా దుకాణం తెరచి వ్యాపారం చేస్తున్నట్లు వైద్యులకు సమాచారం అందించారు. దీంతో వైద్యాధికారి మానసతో పాటు సిబ్బంది దుకాణం వద్దకు చేరుకొని కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లో హోంక్వారంటైన్ పూర్తి కాకుండా ఎందుకు షాపు తీస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శ్రీనివాస్ వైద్యులపై,ఆరోగ్య కార్యకర్తలపై ఎదురు తిరిగి నాకు ఇంట్లో సామగ్రి అయిపోయాయి, ఎవరు తీసుకు వస్తారంటూ ఎదురు సమాధానం ఇచ్చారట. అందుకు మరింత ఆగ్రహించిన వైద్యులు ఆర్థికంగా ఉన్న నీవు కరోనా నిబంధనలు పాటించకుండా కరోనా ప్రబలడానికి కారణమవుతున్నావని మండిపడ్డారు. సామగ్రి నీవు ఎవరికి చెప్పినా తీసుకు వచ్చి ఇచ్చే పరిస్థితి ఉందని, కావాలని దుకాణం తెరచి వ్యాపారం సాగించడం ప్రమాదకరమని ఆగ్రహించి షాపు మూయించి శ్రీనివాస్‌ను ఇంటికి పంపి హోంక్వారెంటేన్ చేశారు. అనంతరం పరిసరాలను శానిటైజ్ చేయించి, నిబంధనలు పాటించకపోతే కేసులు పెడతామని వైద్యులు ధర్మనాయక్, మానస హెచ్చరించారు. అలాగే గొల్లపల్లి, బొప్పపూర్ లో కొందరు వ్యాపారులు, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు హోం క్వారంటైన్‌లో ఉండకుండా నిర్లక్యంగా బయట తిరిగి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని సమాచారం. శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని వైద్యాధికారులు సమాయత్తమవుతున్నారు. గొల్లపల్లి, బొప్పాపూర్‌లో కరోనా కేసులు తీవ్రమవడం, కరోనాతో బొప్పాపూర్ వ్యాపారి చిలివెరు రవీందర్ మృతి చెందినా భయం లేకుండా బంగారు నగల వ్యాపారి శ్రీనివాస్ కరోనా పాజిటివ్ ఉన్నా దుకాణం తెరిచి వ్యాపారం సాగించడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement