Saturday, November 23, 2024

కరోనా నిబంధనలు పాటిస్తూ పనులు..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని పలు గ్రామాలలో ఉపాధి కూలీలు చేస్తున్న పనులలో కరోనా నిబంధనలు పాటించాలని, కూలీలంతా పేదలుగా భావించి వారికి కేటాయించిన పని రోజులు కల్పించాలని డిఆర్‌డిఓ కౌటిల్య రెడ్డి మండల అధికారులను ఆదేశించారు. మండలంలోని అక్కపళ్లి, బుగ్గ రాజేశ్వర తండా గ్రామ పంచాయతీలలో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులను, నర్సరీలను, స్మశాన వాటిక పనులను ఆయన పరిశీలించారు. కూలీలంతా ఒకేచోట గుమిగూడకుండా చూడాలని, అందరూ తప్పకుండా మాస్కులు ధరించి పనులు చేసేలా చూడాలన్నారు. అలాగే గ్రామాలలో నాటిన మొక్కలు ఎండి పోకుండా చూడాలని, ప్రజల కోరిక మేరకు ప్రారంభిస్తున్న ఉపాధి పనులలో అధిక శాతం పేదవారున్నారని, వారికి పని కల్పించాలన్నారు. గ్రామాలలో నిర్మించిన స్మశాన వాటికలని ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. నర్సరీల్లో వంద శాతం మొక్కలు బతికేలా వాటరింగ్‌ చేయాలని, అన్నీ గ్రామపంచాయతీలలో ఉపాధి పనులు కోవిడ్‌ నిబంధనల మేరకు జరగాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిరంజీవి, ఈజీఎస్‌ ఏపిఓ కొమురయ్య, సర్పంచులు, ఉపసర్పంచ్‌లు, కూలీలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement