మెట్‌పల్లి: కరోనా వైరస్‌తో పట్టణ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ఏసాల రాజశేఖర్ మృతిచెందాడు. గత కొద్ది రోజుల క్రితం పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేసన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు ఈ క్రమంలో శుక్రవారం రాత్రి శ్వాసలో ఇబ్బంది ఏర్పడడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ వెళ్లాలని వైద్యులు సూచించడంతో అంబులెన్స్‌లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లగా మార్గమధ్యంలో పరిస్థితి మరింత విషమంగా మారింది. దీంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
అంత్యక్రియలు నిర్వహించిన ఎంపీవైవై సభ్యులు..
మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రాజశేఖర్ కరోనాతో మృతి చెందడంతో బంధువులు ముస్లిం పుర యంగ్ యూత్ సభ్యులకు సమాచారం అందించగా యూత్ సభ్యులు మహ్మద్ అజారుద్దీన్, అఫ్రోజ్, మహమ్మద్ గని, ముజామిల్, సజ్జాద్, సమీర్, జావిద్‌లు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల హిందు స్మశాన వాటికలో కరోనా నిబంధనలు పాటిస్తూ హిందూ సంప్రదాయం ప్రకారం అత్యక్రియలు నిర్వహించారు. రంజాన్ ఉపవాసంలో ఉండి కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం పుర యంగ్ యూత్ సభ్యులను పలువురు అభినందించారు.