Thursday, September 19, 2024

TG: ఓటర్ జాబితా రూపకల్పనలో సహకరించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల, సెప్టెంబర్ -18 (ప్రభ న్యూస్) : గ్రామీణ ఓటర్ జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సంపూర్ణ సహకారం అందజేయాలని, ఓటరు జాబితా రూపకల్పనపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మీనీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ తో కలిసి గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పనపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ… గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని, ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 13న గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 260 గ్రామ పంచాయతీల పరిధిలోని 2268 వార్డుల్లో మొత్తం 3 లక్షల 46 వేల 220 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేశామని, ఇందులో గల అభ్యంతరాలు, నూతన ఓటర్ నమోదు దరఖాస్తులను సెప్టెంబర్ 21 లోపు సంబంధిత మండలాల ఎంపీడీఓలకు లిఖిత పూర్వకంగా సమర్పించాలని, సెప్టెంబర్ 26 లోపు అభ్యంతరాలను పరిష్కరించి, సెప్టెంబర్ 28న తుది ఓటర్ జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు.

- Advertisement -

ఒక కుటుంబంలోని సభ్యులందరికీ ఓకే వార్డులో ఓట్లు ఉండేలా కార్యాచరణ రూపొందించామని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ఓటరు జాబితా పకడ్బందీగా తయారు చేసేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సంపూర్ణ సహకారం అందజేయాలని, ఓటర్ జాబితా రూపకల్పనపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు.

తంగలపల్లి కేసీఆర్ నగర్ ప్రాంతంలో అధికంగా జనాభా ఓటర్లు ఉన్నందున దానిని ప్రత్యేక గ్రామపంచాయతీ చేసే ప్రతిపాదనను పరిశీలించాలని రాజకీయ పార్టీల పక్షాలు కోరగా, ఇది ప్రభుత్వ పరిధిలోని అంశం అని ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, జిల్లా ఇంఛార్జి పంచాయతీ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, జడ్పీ డీప్యూటీ సీఈఓ గీతా, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement