పెద్దపల్లి రూరల్, జులై 19 (ప్రభన్యూస్): దేశానికి అన్నం పెట్టే రైతులను మరోసారి గోస పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి మండలం పాలితం రైతు వేదికలో క్లస్టర్ పరిధిలోని పాలితం, నిట్టూరు, నిమ్మనపల్లి, తుర్కల మద్దికుంట, గోపయ్యపల్లి రైతులతో మేలుకో రైతన్న.. సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ… రైతులను అరిగోస పెట్టే కుట్ర చేస్తున్న కాంగ్రెసోళ్లతో జాగ్రత్తగా ఉండాలని కోరారు. సకల సౌకర్యాలు కల్పిస్తున్న బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ని మరోసారి ఆశీర్వదించాలన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ వల్లే అన్నదాత ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. 24 గంటల కరెంటుపై కుట్రలు చేస్తున్న కాంగ్రెసోళ్లను ఊర్లకు వస్తే నిలదీసి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండి.. రైతుల కంట కన్నీరు కారిందని, తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టలేక అన్నదాతల గుండెలు ఆగిపోయాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోని కరెంట్ కష్టాలను అంత తొందరగా ఎలా మర్చిపోతామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలన్నారు. మూడు పంటల తెలంగాణ కావాలని బీఆర్ఎస్ సంకల్పం తీసుకుంటే.. మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ రైతు ద్రోహ విధానాన్ని ప్రకటించిందన్నారు. మూడు పంటల బీఆర్ఎస్ కావాలా.. మూడు గంటల కాంగ్రెస్ కావాలా.. తెలంగాణ రైతాంగం తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈకార్యక్రమంలో జిల్లా రైతు సవిుతి అధ్యక్షుడు కాసర్ల అనంత రెడ్డి, ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్,పీఏసీఎస్ ఛైర్మెన్ దాసరి చంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, వైస్ ఎంపీపీ రాజయ్య, సర్పంచ్‌లు పద్మ రవీందర్, దాతు మంజుల సదయ్య, జయప్రద సంజీవ రెడ్డి, ఎంపీటీ-సీ లక్ష్మీ రాజేశం, రైతు సమితి గ్రామాల కో ఆర్డినేటర్లు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.