ముత్తారం: మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మొన్న యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బియ్యని శివకుమార్ రాజీనామా చేయగా, ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫీతోపాటు వార్డుసభ్యులు కాంగ్రెస్ కి రాజీనామా చేసి పార్టీ నాయకులకు షాకిచ్చారు. మండలంలో రోజు రోజుకు కాంగ్రెస్ నాయకులు రాజీనామాల బాట పడుతుంటే వారు ఏ పార్టీలోకి వెళతారనేది మండల ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఒక నాయకుడిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ప్రోటోకాల్ పేరుతో మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అతని బాధను తట్టుకోలేక రాజీనామాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మనస్ఫర్థలతోపాటు వేర్వేరు కుంపట్లు.. ఎవరికి వారే యమునా తీరే.. అనేలా వ్యవహరిస్తుండడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేశారా.. లేదా ఇతర పార్టీలో చేరేందుకు రాజీనామాలు చేశారా.. అనేది అర్ధం కాని పరిస్థితి. రాజీనామాల పరంపర కొనసాగే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మండలం ప్రస్తుతం ఉన్న నాయకులను కూడా కాపాడుకోలేని పరిస్థితులకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్ల పరిస్థితి ఇంకెంత దూరం వెళుతుందోనని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement