సుల్తానాబాద్, డిసెంబర్ 30 (ప్రభ న్యూస్) : రాజీమార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాలు సత్వర న్యాయం పొందవచ్చని సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి జీఎస్ఎల్. ప్రియాంక అన్నారు. ఇవాళ జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ప్రియాంక మాట్లాడుతూ… క్షణికావేశంలో చేసిన నేరాలకు కోర్టుల చుట్టూ తిరిగి వ్యయప్రయాసలకు గురికాకుండా రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చునని, ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించబడ్డ కేసుల్లో ఇరువర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపడం నేరమన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వాహనదారులకు, ఓపెన్ డ్రింక్ చేసిన వారికి జరిమానాలు విధించినట్లు తెలిపారు.
ఈ లోక్ అదాలత్ లో పలు క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాలు, భార్యాభర్తల వివాదాలు కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి దాదాపు 850 కేసులను పరిష్కరించినట్లు కోర్టు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు వివిధ చట్టాలపై కక్షదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భూసారపు బాలకిషన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, ఏపీపీ శ్యాం ప్రసాద్, ఏజీపీ మేకల తిరుపతిరెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు పబ్బతి లక్ష్మికాంతరెడ్డి, ఆలూరి శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాది ఆవుల లక్ష్మీరాజంలతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.